CM Revanth’s benami company gets Rs. 6,000 crore worth of work : తెలంగాణ రాజకీయాల్లో కాంట్రాక్టుల కేటాయింపు వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ‘బినామీ’ ఆరోపణలపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ‘KLSR’ అనే నిర్మాణ సంస్థ నేరుగా ముఖ్యమంత్రికి బినామీ కంపెనీ అని, దానికి ఏకంగా రూ.6,000 కోట్ల విలువైన పనులను అప్పగించారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వాడుతున్న కారు కూడా అదే సంస్థ పేరు మీద రిజిస్టర్ అయి ఉండటమే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని తన సన్నిహితులకు భారీగా దోచిపెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
సదరు కంపెనీ ఆర్థిక పరిస్థితిపై కూడా కేటీఆర్ కీలక వివరాలను వెల్లడించారు. 2018లోనే ఈ సంస్థపై ఐటీ దాడులు జరిగాయని, 2023 నాటికి ఈ కంపెనీ పూర్తిగా దివాళా తీసిందని ఆయన గుర్తు చేశారు. కనీసం తమ సిబ్బందికి జీతాలు చెల్లించే స్థితిలో కూడా లేని ఒక కంపెనీకి, వేల కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులను ఏ ప్రాతిపదికన కట్టబెట్టారని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక భారీ అవినీతి దాగి ఉందని, దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా నోటీసులు జారీ చేసిందని కేటీఆర్ వివరించారు.
ఈ ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒకవైపు పాలనను పరుగులు పెట్టిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుండగా, క్షేత్రస్థాయిలో బినామీ కంపెనీలకు దోచిపెడుతున్నారన్న కేటీఆర్ విమర్శలు ప్రభుత్వ ప్రతిష్టను సవాల్ చేస్తున్నాయి. అసలు టెండర్ల ప్రక్రియలో నిబంధనలు పాటించారా లేదా అన్న కోణంలో చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
