తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కేరళకు వెళ్ళనున్నారు. ఆయన వయనాడ్‌లో ప్రియాంక గాంధీ తరపున ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్లనున్నారు, వీరిద్దరూ రేపు జరిగే ర్యాలీలో పాల్గొని ప్రియాంక గాంధీ తరుపున ప్రచారం చేయబోతున్నారని సమాచారం. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు చెందిన మంత్రులతో పాటు సీఎం ను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే మంత్రి భట్టి విక్రమార్క జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో నామినేషన్ వేసిన సందర్భంగా, సీఎం రేవంత్‌తో పాటు పలువురు కీలక నేతలు అక్కడికి వెళ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పుడు సీఎం రేవంత్ వయనాడ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంలో, పార్లమెంట్ ఎన్నికల్లో వయనాడ్ మరియు రాయ్ బరేలీ స్థానాల్లో గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి రాజీనామా చేసినందున, అక్కడ ఉపఎన్నిక జరుగుతోంది. ప్రియాంక గాంధీ ఈ స్థానం నుండి బరిలోకి దిగుతుండటంతో, కాంగ్రెస్ అక్కడ కచ్చితంగా గెలవాలని భావిస్తోంది. మరోవైపు, ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడంతో, ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
వయనాడ్ స్థానం నుండి రాహుల్ గాంధీ రెండు సార్లు విజయం సాధించారు. 2019లో, కాంగ్రెస్ కంచుకోట అమేథీ మరియు వయనాడ్ స్థానాలలో పోటీ చేసిన ఆయన, అమేథీలో ఓడినప్పటికీ వయనాడ్‌లో విజయం సాధించారు. అందువల్ల, వయనాడ్ రాహుల్ గాంధీకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది, మరియు అక్కడ ప్రజలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే, రాబోయే ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలనే లక్ష్యంతో బీజేపీ కృషి చేస్తోంది.
ఇంతలో, బీజేపీ వయనాడ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది, ఆ పార్టీ నుంచి నవ్య హరిదాస్ అనే మహిళను బరిలోకి దించనుంది. అదేవిధంగా, ప్రియాంక స్థానికేతరులు అనే భావనను రగిల్చే ప్రయత్నాలు చేస్తుండటంతో, ఆ పార్టీపై విమర్శలు పెరుగుతున్నాయి. కేరళ తమకు కంచుకోటగా ఉండడంతో, ఎల్ డీఎఫ్ నేతలు కూడా వయనాడ్‌పై దృష్టి పెట్టారు. దీంతో, ఈ స్థానం కోసం త్రిముఖ పోరాటం జరగడంతో ఎన్నికల ప్రచారం ఉత్కంఠగా ఉండబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది.