Site icon HashtagU Telugu

CM Revanth Reddy : సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు మార్పు కోసం పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటేశాడు

CM Revanth Reddy's visit to Australia is cancelled

CM Revanth Reddy's visit to Australia is cancelled

CM Revanth Reddy : ఏడాది పాలనపై సీఎం రేవంత్‌ రెడ్డి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు… పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు అని ఆయన రాసుకొచ్చారు. అంతేకాకుండా.. ‘ఆ ఓటు అభయహస్తమై… రైతన్న చరిత్రను తిరగరాసింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ… రూ.7,625 కోట్ల రైతు భరోసా… ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్… రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్… రూ.1433 కోట్ల రైతుబీమా… రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం… రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు… ఒక్క ఏడాదిలో … 54 వేల కోట్ల రూపాయలతో… రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం. ఇది నెంబర్ కాదు… రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం. ఈ సంతోష సమయంలో… అన్నదాతలతో కలిసి… రైతు పండుగలో పాలు పంచుకోవడానికి… ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా.’ అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా, మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించే రైతు పండుగ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు పాల్గొననున్నారు. ఈ సదస్సులో వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ, నూతన సాంకేతిక విధానాలు, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, అనంతరం మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు స్వగృహం నుండి బయలుదేరి, రోడ్డు మార్గం ద్వారా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 3:30 గంటలలో మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు పండుగ సదస్సుకు చేరుకొని, వ్యవసాయ సంబంధిత స్టాళ్లను పరిశీలించి, 4:30 గంటలకు బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు సదస్సుకు హాజరుకానున్నారు.

Read Also : National Computer Security Day: నేషనల్ కంప్యూటర్ సెక్యూరిటీ డే ఎందుకు జరుపుకుంటారు..?