CM Revanth Medaram Visit: మేడారం జాతర అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 23న (మంగళవారం) మేడారంలో పర్యటించనున్న (CM Revanth Medaram Visit) నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్వయంగా రంగంలోకి దిగారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు ఆమె ఆదివారం మేడారంలో అధికారులతో, పూజారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అధికారులతో మంత్రి సమీక్ష
సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు, పూజారులు పాల్గొన్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లపై మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: Mahindra: మహీంద్రా కార్ల ధరలు తగ్గింపు.. ఎక్స్‌యూవీ 3XOపై భారీ ఆఫర్లు!
ఎంగిలిపూల బతుకమ్మ పండుగ రోజున కూడా బాధ్యతలు
సాధారణంగా పండుగ రోజుల్లో ప్రజలు తమ ఇళ్లలో గడుపుతారు. కానీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ రోజున కూడా మంత్రి సీతక్క తన బాధ్యతలను విస్మరించకుండా ఉదయం 10 గంటలకు మేడారానికి చేరుకున్నారు. ఇది ఆమె బాధ్యతాయుతమైన వైఖరికి నిదర్శనం. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు, ఆలయ ప్రాంగణంలో చేయాల్సిన మార్పులపై పూజారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారి సూచనలను పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అభివృద్ధిపై మంత్రి హామీ
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఈ ప్రణాళికను ఖరారు చేస్తారని, ఆ తర్వాత అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. సీఎం పర్యటన మేడారం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆమె అన్నారు. భక్తుల సౌకర్యార్థం రోడ్లు, తాగునీరు, వసతి వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఈ పర్యటన ద్వారా మేడారం జాతర ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందుతుందని, అలాగే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు.
