Congress : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించడంతోపాటు, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం దేశ రాజధానిలో నిర్వహించబోయే ప్రత్యేక ధర్నాలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, బీసీ సంఘాల సమన్వయంతో మూడు రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద పెద్ద స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు కేంద్రాన్ని ఒప్పించే లక్ష్యంతో పెద్ద ఎత్తున ప్రజా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయనుంది కాంగ్రెస్.
Read Also: wildfire : కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 65వేల ఎకరాల్లో మంటలు, ప్రజలకు వార్నింగ్ బెల్స్
ఈ ధర్నాకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి కీలక నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముందుగానే అక్కడ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఈ ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర జాతీయ నేతలు కూడా ఈ ధర్నాలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీసీ హక్కుల పరిరక్షణకు ఈ ధర్నా ప్రధాన మైలు రాయిగా మారనుందని అంచనా. ఇదిలా ఉంటే, బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంటులోనూ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా స్పందించనుంది. ఇందుకోసం వాయిదా తీర్మానాలను కాంగ్రెస్ ఎంపీలు ప్రవేశపెట్టనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్డినెన్స్‌ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే.
అయితే, దానిని కేంద్రం ఆమోదించాల్సిన అవసరం ఉంది. దీనికోసమే ఢిల్లీలో ఈ స్థాయిలో రాజకీయ ఒత్తిడిని పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. తెలంగాణలో బీసీల ఓటు బ్యాంక్‌ను మరింత మద్దతుగా మార్చుకోవాలని చూస్తున్న కాంగ్రెస్, ఆ వర్గానికి మరింత న్యాయం చేయాలన్న సంకల్పంతో ఈ ఉద్యమాన్ని ముమ్మరం చేస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉద్యమంలో పాల్గొనడం ఈ పోరాటానికి మరింత ఊపు తెచ్చే అంశంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంత భారీ స్థాయిలో బీసీ హక్కుల కోసం దేశ రాజధానిలో తెలంగాణ నాయకత్వం చేపట్టిన ఇది మునుపెన్నడూ లేని ప్రయత్నంగా చెప్పొచ్చు. ఈ ధర్నా వేదికగా బీసీల సమస్యలను దేశవ్యాప్తంగా వినిపించేలా చేయడమే ముఖ్య ఉద్దేశ్యం. ఆగస్టు 6న ప్రారంభమయ్యే ఈ ధర్నా, మూడు రోజుల పాటు సాగనుంది. రాష్ట్రంలో బీసీల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఈ రిజర్వేషన్లు కీలకం కావడంతో, దీని సాధన కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్పందన ఎలాంటి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Novak Djokovic : సిన్సినాటి ఓపెన్ నుంచి జోకోవిచ్ ఔట్.. ఎందుకంటే..