ఏ ప్రభుత్వమైనా ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా..? పది నెలలు ఓపిక పట్టలేరా? పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా? అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పెద్దపల్లిలో బుధవారం ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా యువ వికాసం సభ(Yuva Vikasam Meeting)లో అన్నారు. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రత్యేక స్టాల్స్ ను రేవంత్ పరివేక్షించి అనంతరం అలాగే రూ. 1024 కోట్ల 90 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన (CMRevanth) మాట్లాడుతూ..ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 54 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని, అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(Young India Skill University)ని ఏర్పాటు చేసి యువకుల్లో వృత్తి నైపుణ్యతను పెంపొందించే చర్యలకు శ్రీకారం చుట్టామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) పదేళ్ల కాలంలో, ఉద్యోగాల ఊసే లేకుండా పరిపాలించిందని, తాము ఉద్యోగాలు ఇస్తుంటే యువకులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వ్యవహరించిందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయమని, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
ప్రజల ఆశీస్సులతోనే సామాన్యుడినైన తాను సీఎం అయ్యానని .. ‘తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ మొదట ఈ గడ్డపై నుంచే చెప్పారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
కేసీఆర్ పాలనలో గిట్టుబాటు ధర రాక రైతులు ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయనకు మాత్రం ఎకరాకు రూ.కోటి ఆదాయం వచ్చింది’ అని విమర్శించారు. కెసిఆర్ రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని కానీ మేం కట్టిన శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు 60 ఏళ్లు ఉన్నాయని..అవి ఎలా ఉన్నాయో, నువ్వు కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చూడ్డానికి రా. లెక్కలు తేలుద్దాం’ అని సవాల్ విసిరారు. కాళేశ్వరం నుంచి చుక్కనీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని సీఎం తెలిపారు.
ఏ ప్రభుత్వమైనా ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘దిగిపో.. దిగిపో అని కేసీఆర్, హరీశ్, కేటీఆర్ అంటున్నారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నారు. పది నెలలు ఓపిక పట్టలేరా? పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా? ప్రభుత్వం ఏ పని చేయాలన్నా విధివిధానాలు ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి సహేతుక సలహాలు ఇచ్చారు’ అని సీఎం వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తమ ప్రభుత్వంపై ఎన్నో దుష్ప్రచారాలు సాగిస్తున్నారని, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం వాటికి సమాధానమన్నారు.
Read Also : Keerthy Suresh Wedding Card : కీర్తి సురేశ్ పెళ్లి కార్డ్ వైరల్..