Site icon HashtagU Telugu

CM Revanth : బాబు వద్ద నేర్చుకొని , రాహుల్ వద్ద పని చేస్తున్న – సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Revanth Cbn

Revanth Cbn

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Haryana Governor Bandaru Dattatreya) స్వయంస్వీకృత గ్రంథం ‘ప్రజలే నా ఆత్మకథ’ (autobiography book) పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో దత్తాత్రేయ జీవన ప్రయాణాన్ని ప్రశంసించారు. గౌలిగూడ గల్లీ నుంచి గవర్నర్ పీఠం వరకు ఎదిగిన దత్తాత్రేయ జీవితం అనేక మందికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. దేశ రాజకీయాల్లో వాజ్‌పేయికి ఉన్న గౌరవం రాష్ట్రస్థాయిలో దత్తాత్రేయకు ఉందని వ్యాఖ్యానించారు.

Knee Pain: మోకాళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ ప్ర‌మాద‌క‌ర వ్యాధులు ఉన్న‌ట్లే!

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమైన జ్ఞాపకాన్ని గుర్తు చేశారు. ఇటీవల ఆయన ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారని, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి భోజనం చేసిన సందర్భాన్ని వివరించారు. భోజన సమయంలో ప్రధాని, రేవంత్‌ను చూసి, “మీ సన్నిహితుడు చంద్రబాబు ఇక్కడే ఉన్నారు” అని అన్నారు. దానికి రేవంత్ సరదాగా స్పందిస్తూ “స్కూల్ మీ వద్ద (బీజేపీ) చదివాను, కాలేజీ చంద్రబాబు వద్ద చదివాను, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నాను” అని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.

రేవంత్ తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా సంక్షిప్తంగా గుర్తుచేశారు. ఆయన మొదట ఏబీవీపీ నేతగా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా నియమితులై, ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. రేవంత్ వ్యాఖ్యలన్నీ ఆయన రాజకీయ అనుభవాన్ని, వివిధ పార్టీలతో ఉన్న పరిచయాలను హాస్యంతో కలిపి చక్కగా వివరించగా, సభలోని అందరినీ ఆకట్టుకున్నాయి.