Site icon HashtagU Telugu

CM Revanth Reddy : ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ వల్లే ఎక్కువ నష్టం – సీఎం రేవంత్

Cm Revanth Ngd

Cm Revanth Ngd

తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ (KCR) పదేళ్ల పాలన వల్లే అధిక నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) తీవ్ర విమర్శలు చేశారు. నల్గొండ జిల్లాలో వైద్య కళాశాల ప్రారంభోత్సవం, నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్‌ఆర్ (YSR) ప్రారంభించారని, కానీ కేసీఆర్ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల లక్ష ఎకరాల సాగు భూమికి నీరు అందలేదని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ (Nalgonda) ఫ్లోరైడ్ సమస్య తీరేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నల్గొండ ప్రజలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని, ఉద్యమానికి సంబంధించిన స్మృతులు నల్గొండ పేరు వినగానే గుర్తుకువస్తాయని అన్నారు.

కేసీఆర్ పాలనపై విమర్శలు చేయడంతో పాటు, బీజేపీపై కూడా రేవంత్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చూపించగలవా అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శిస్తూ, అభివృద్ధి ప్రాజెక్టుల్ని అడ్డుకోవడం తప్పా మరే ఇతర పనిని ఆయన గాలి బ్యాచ్ చేస్తున్నదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఏ ఇతర రాష్ట్రం ఇవ్వలేదని, ఇది రికార్డు అని ఆయన తెలిపారు. ఈ విషయం అసెంబ్లీలో లెక్కలతో రుజువు చేస్తానని, బీఆర్‌ఎస్‌ లేదా బీజేపీ ఈ సంఖ్యను తలదన్నగలదా అంటూ సవాలు విసిరారు. రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టిన తమ ప్రభుత్వం సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తుందని హామీ ఇచ్చారు. గెలిచినా ఓడిపోయినా ప్రజల కోసం పనిచేయడం బాధ్యత అని, కానీ కేసీఆర్ గెలిస్తే పొంగిపోతారని, ఓడితే ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతున్నారని సెటైరిక్‌గా వ్యాఖ్యానించారు.

Read Also : IND vs AUS 2nd Test: ఓట‌మికి చేరువ‌లో టీమిండియా.. రెండో రోజు ముగిసిన ఆట‌!