CM Revanth Meets Union Minister: తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Meets Union Minister) విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, ప్రపంచ స్థాయి పరిశోధన, అభివృద్ధి కేంద్రాల తెలంగాణలో ఉన్నందున ప్రతిపాదిత అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (ASIP) ప్రాజెక్ట్, మైక్రో LED డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్ కు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైల్ భవన్‌లో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుకు EMC 2.0 పథకం కింద తెలంగాణ వినతిని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రీజినల్ రింగు రోడ్డు సమీపంలో నూతన ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
📍 Telangana CM Revanth Reddy in Delhi
Focused on accelerating Telangana’s development!👉 CM Revanth Reddy held a crucial meeting with Union Minister Ashwini Vaishnaw
🔹 Discussed key Railway Projects
🔹 Boosting IT Infrastructure pic.twitter.com/3v7K2kEOfU— MOHD ABID ALI (@TPCCali) July 17, 2025
తెలంగాణలో రైల్వే అనుసంధానత పెంపు కోసం నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డుకు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించామని… ఇందుకు రైల్వే బోర్డు ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిందని సీఎం తెలిపారు. రూ.8 వేల కోట్ల విలువైన ఈ రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్ట్ కు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
Also Read: NEFT & IMPS : బ్యాంక్ మనీ ట్రాన్స్‌ఫర్.. IMPS & NEFT ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి?
రీజినల్ రింగ్ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరగడంతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. రీజినల్ రింగు రైలు ప్రాజెక్టుతో గ్రామీణ పేదరికం తగ్గడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సీఎం తెలిపారు. హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బందరు ఓడ రేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఔషధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ఈ మార్గం దోహదపడుతుందని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆపరేషన్స్ ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సీఎం అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు భద్రత, వేగవంతమైన సేవలు అందించేందుకు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
తెలంగాణలో వివిధ ప్రాంతాల అనుసంధానత, పారిశ్రామిక, వ్యవసాయక ఎగుమతులు, దిగుమతుల కోసం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నూతన రైలు మార్గాలు మంజూరు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా వికారాబాద్-కృష్ణా (122 కి.మీ.- అంచనా వ్యయం రూ.2,677 కోట్లు, కల్వకుర్తి-మాచర్ల (100 కి.మీ.-అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు, డోర్నకల్-గద్వాల (296 కి.మీ.-అంచనా వ్యయం రూ.6,512 కోట్లు), డోర్నకల్-మిర్యాలగూడ (97 కి.మీ.-అంచనా వ్యయం 2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.