Delhi : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మంగళవారమే ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ప్రధాని ఈ మేరకు రేవంత్ రెడ్డి మోడీని ఆయన నివాసంలో కలిశారు. రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సాయంపై, రాష్ట్ర అభివృద్ధిపై చర్చిస్తున్నారు. ఫ్యూచర్ సిటీకి కేంద్రం సాయం అందించాలని కోరారు.
Read Also: Maha Shivratri : శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అనం
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ కూలి 8 మంది చిక్కుకుపోయిన ఘటనను ప్రధాని వద్ద సీఎం రేవంత్ ప్రస్తావించారు. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఏమేం సహాయక చర్యలు చేపట్టారో ప్రధానికి వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. వాటిని త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఫేస్-2 మెట్రో లైన్, ఎయిర్‌పోర్ట్ పొడగింపు.. దానికి కావాల్సిన ఆర్థిక సహాయం.. అనుమతులు, మూసీ నది సుందరీకరణ నిధులు, కేంద్రం నుంచి వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, తెలంగాణకు ఐటీఐఆర్, ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, ఆర్థిక సహాయం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
ఇక, ప్రధానంగా బీసీలకు రిజర్వేషన్ల అంశంపై సైతం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలు ఉన్నాయి. బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపుపై క్లారిటీ కోసం కేంద్రాన్ని కోరనున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇంకా పరిష్కారం కానీ అంశాలపై కేంద్రం చొరవ చూపాలని కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ పర్యటనలో ప్రధానితో భేటీ అనంతరం కొందరు కేంద్ర మంత్రుల్ని తెలంగాణ సీఎం కలవనున్నారు. పలు శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల పురోగతి పనులపై చర్చించనున్నారు. కేంద్ర మంత్రులతో భేటీల అనంతరం ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారని తెలుస్తోంది.