Old City Metro: ఎట్టకేలకు ఓల్డ్ సిటీకి మెట్రో.. 7న సీఎం శంకుస్థాపన

పాతబస్తీకి మెట్రో మోక్షం లభించనుంది. ఓల్డ్ సిటీకి మెట్రో సేవలు అంశం గత పదేళ్లుగా కేవలం చర్చలకే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్టకేలకు ఆ ఏరియాలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.

Old City Metro: పాతబస్తీకి మెట్రో మోక్షం లభించనుంది. ఓల్డ్ సిటీకి మెట్రో సేవలు అంశం గత పదేళ్లుగా కేవలం చర్చలకే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్టకేలకు ఆ ఏరియాలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. హైదరాబాద్‌ మెట్రో రైలు పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మార్చి 7న శంకుస్థాపన చేయనున్నారు. పాతబస్తీ ఫలకునామాలో మెట్రో పనులు ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై పాతబస్తీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నాగోల్‌, ఎల్‌బీ నగర్‌ మెట్రో స్టేషన్‌లను కలుపుతూ ఎల్‌బీ నగర్‌ నుంచి పాతబస్తీ మీదుగా ప్రతిపాదిత సవరించిన ఎయిర్‌పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్‌ కోసం ట్రాఫిక్‌ అధ్యయనాలు, సవివర ప్రాజెక్టు నివేదికలు వేగవంతం చేయాలని జనవరిలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు లేకుండా, అలాగే నిర్మాణ వ్యయాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.ఇదిలా ఉండగా హైదరాబాద్ మెట్రో రైల్ సికింద్రాబాద్‌లోని జెబిఎస్ మరియు పాతబస్తీలోని ఫలక్‌నుమాను కలుపుతూ గ్రీన్ లైన్‌ను పూర్తి చేయడానికి సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షమ్‌షీర్‌గంజ్ మరియు ఫలక్‌నుమా వంటి ముఖ్యమైన ల్యాండ్‌మార్క్‌లకు సమీపంలో ఐదు మెట్రో స్టేషన్ల కోసం తాత్కాలిక స్థానాలను గుర్తించింది.

2017లో హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు ప్రారంభించినప్పటికీ ఎంఐఎం అభ్యంతరాల కారణంగా మహాత్మా గాంధీ బస్టాండ్ వద్ద మెట్రో మెట్రో పనులు ఆగిపోయాయి. ఎఐఎంఐఎం సూచించిన ప్రత్యామ్నాయ మార్గానికి ఎల్‌అండ్‌టి అంగీకరించకపోవడమే కాకుండా, అగ్రిమెంట్ గడువు ముగిసిపోవడంతో పాటు ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిపోవడంతో పనిని పూర్తి చేయడంలో అసమర్థతను వ్యక్తం చేసింది.

పాతబస్తీ మెట్రో పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయాలని, వీలైనంత త్వరగా మెట్రో సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఓల్డ్ సిటీ ప్రజలు కోరుతున్నారు.

Also Read: BJP Alliance In AP: పొత్తు లేనట్లేనా.. అభ్యర్థుల వేటలో ఏపీ బీజేపీ