తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ( Engineering Colleges) తరచూ ఫీజులు పెంచుతున్న (Fee-Hike) వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. ఫీజులు పెరిగిపోతూ పోతే కన్వీనర్ కోటా సీట్లకైనా విద్యార్థులు వెనుకాడే పరిస్థితి తలెత్తొచ్చని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీలు అందిస్తున్న విద్యా నాణ్యత, నిబంధనలు పాటిస్తున్న అంశాలపై అధికారులు సమాధానం ఇవ్వాల్సిందిగా ఆయన ఆదేశించారు.
2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాలకి సంబంధించి కొత్త ఫీజుల ఖరారుపై అధికారులు సమర్పించిన నివేదికను సీఎం రివ్యూలో పరిశీలించారు. ప్రతి సంవత్సరం ఫీజుల పెంపు ఏమిటనే ప్రశ్న CM ముందుంచినట్లు తెలుస్తోంది. గతంలో 2016లో పంపిన విజిలెన్స్ బృందాల నివేదికలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? వాటిపై తీసుకున్న చర్యలేమిటనే అంశాలపై సీఎం విచారణకు ఆదేశించారు. అంతేగాక, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై కూడా ఇంజినీరింగ్ తరహాలో సమగ్ర చట్టం అవసరమని పేర్కొన్నారు.
Air India Ahmedabad Plane Crash : 274 కు చేరిన మృతుల సంఖ్య
2025-26 విద్యా సంవత్సరం బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ జూలై మొదటి వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త ఫీజులు ఖరారు చేసి జీవోలు జారీ చేయాల్సిన సమయం నెల రోజులే ఉండటంతో ఇది సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ఆదేశాల ప్రకారం లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సి రావడంతో ఈసారి కూడా పాత ఫీజుల ప్రకారమే ట్యూషన్ వసూలు చేసి, తర్వాత వ్యత్యాసాన్ని సర్దుబాటు చేసే అవకాశముందని భావిస్తున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వం తేల్చే నిర్ణయాన్ని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.