CM Revanth Reddy: పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వచ్చినా గత తొమ్మిదేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజల మద్దతుతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధం అవుతున్నారని అన్నారు.
అంతేకాకుండా వ్యసనాలకు బానిసలైన కొంతమంది డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలి. మీ అందరిని (ఎస్సై ట్రైనింగ్ అయినపోయిన వారిని ఉద్దేశించి) చూస్తోంటే తెలంగాణ డ్రగ్స్ రహితంగా మారుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు. ఇది ఉద్యోగ బాధ్యత కాదు.. ఇది భావోద్వేగం. తెలంగాణను పునర్నిర్మించి, భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఏ సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులే అని తెలిపారు.
Also Read: Prakasam Barrage Boats Remove Operation : ఈ ప్లాన్ నైనా వర్కవుట్ అవుద్దా..?
డ్రగ్స్ , గంజాయిపై ఉక్కు పాదం మోపుతాం. డ్రగ్స్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. తెలంగాణను కాపాడుకునేందుకే ఖాకీ డ్రస్సులనే విశ్వాసం ప్రజలకు కల్పించండి. 50 ఎకరాల్లో హైదరాబాద్ లో పోలీసుల పిల్లల కోసం రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. 50 ఎకరాల్లో వరంగల్ లో మరో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ లో పోలీస్ స్కూల్ ఏర్పాటు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవసరం. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే నేరస్తులకు కాదు. ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడమే కాదు.. రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటోందని ఈ సందర్భంగా తెలిపారు. కేవలం 28 రోజుల్లోనే 22 లక్షల 22 వేల 685 రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు వేసి రుణమాఫీ చేశాం. కడుపు కట్టుకుని నిధులు సేకరించి రుణమాఫీ చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయి. వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. అందుకే చేరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నామన్నారు.