Pashamylaram : సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం వద్ద జరిగిన ఘోర రసాయన పేలుడు ఘటన రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. సిగాచీ ఇండస్ట్రీస్ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం సంభవించిన ఈ భారీ పేలుడులో ఇప్పటి వరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు వివేక్, దుదిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజనర్సింహలు కూడా ఉన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి ఉన్న ఉన్నతాధికారులతో సీఎం తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ బృందాలకు ఆయన ధైర్యం చెప్పారు.
Read Also: Ponguleti : దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం, సీఎం సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకోనున్నారు. ఈ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇది ఒక విషాదకరమైన సంఘటన. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తుంది. సహాయక చర్యలు పూర్తయ్యాక బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నారు. సోమవారం రాత్రి వరకు మృతుల సంఖ్య 12గా ఉండగా, మంగళవారం ఉదయానికి అది 34కి చేరింది. శిథిలాల నుంచి మరిన్ని మృతదేహాలు బయటపడడంతో మృతుల సంఖ్య 42కి పెరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ..”శిథిలాల తొలగింపు చివరి దశలో ఉంది. మరోసారి పరిశీలన తర్వాత సహాయక చర్యలు ముగుస్తాయి. బాధితుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది అన్నారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. పలువురు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు సంఘటనపై స్పందించారు. పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ప్రమాద ఘటన బాధితులకు సత్వరంగా న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ ప్రకటన మేరకు, మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించనున్నట్టు సమాచారం.
Read Also: Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలుకు అంతర్జాతీయ పురస్కారం, ప్రత్యేక గుర్తింపు