CM Revanth Reddy : చెరువులు, కుంటలు, పార్కులు, ఇతర ప్రభుత్వ భూముల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో బుద్ధభవన్ పక్కనే కొత్తగా నిర్మించిన హైడ్రా భవన్‌లో జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం, హైడ్రా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం, హైడ్రా కోసం ప్రత్యేకంగా కేటాయించిన డీసీఎం, స్కార్పియో కార్లు మరియు బైకులను ప్రారంభించారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన ముఖ్యమంత్రి, అక్కడి ఏర్పాట్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ నుండి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: Maoists : బీజాపూర్‌లో ఎదురు కాల్పులు.. 8మంది మావోయిస్టులు మృతి
10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన హైడ్రా స్టేషన్‌కు ఏసీపీ తిరుమల్, ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు నిర్వహించనున్నారు. మొత్తం ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు మరియు 30 మంది కానిస్టేబుళ్లతో స్టేషన్ పని చేయనుంది. హైడ్రా పోలీస్ వ్యవస్థ కోసం ప్రభుత్వం మొత్తం 70 వాహనాలను కేటాయించింది. ఈ ప్రత్యేక దళం ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోనుంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “సర్కారు భూములు ప్రజల సంపద. వాటిని రక్షించేందుకు ప్రభుత్వం ప్రతినిధిగా హైడ్రా ఏర్పాటైంది. హైదరాబాద్‌తో ప్రారంభించిన ఈ ప్రయాణాన్ని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం,” అని తెలిపారు. ప్రజా హితానికి, భూముల పరిరక్షణకు ఇది ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హైడ్రా ప్రత్యేకాధికారి రంగనాథ్ మాట్లాడుతూ, హైడ్రా ప్రత్యేక దళం ముంపు బాధితుల సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరిస్తోందని తెలిపారు. ప్రజలకు ఏ శాఖను సంప్రదించాలో తెలియని పరిస్థితుల్లో హైడ్రా తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటుందని రంగనాథ్ తెలిపారు. ‘‘ఫలానా సమస్య మా పరిధిలోకి రాదు అని మేము అంటం లేదు. ఏ శాఖ పని అయినా ముందుగా మేమే విభజించుకుని పరిష్కరిస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ సంకల్ప బలానికి నిదర్శనం’’ అని అన్నారు. హైడ్రా కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుగా అభివర్ణిస్తూ, వరదలతో తరచూ ఎదురయ్యే ముంపు సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారం కావచ్చని రంగనాథ్ అభిప్రాయపడ్డారు.
చెరువులు, నాళాలు ఆక్రమణకు గురవుతున్నాయని, అయితే హైడ్రా చొరవతో ఇప్పుడప్పుడే వాటిని తొలగించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కొత్తగా ప్రారంభమైన హైడ్రా పోలీస్ స్టేషన్‌తో పాటు, హైడ్రా బృందానికి అందుబాటులోకి తీసుకురావడమైన వాహనాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను సీఎం ప్రారంభించారు. వాటి వినియోగంతో హైడ్రా స్పందన మరింత వేగవంతం అవుతుందని అధికార వర్గాలు విశ్వసిస్తున్నాయి. ‘‘హైడ్రా పనితీరు వలన ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోంది. గతంలో ఏ శాఖ వద్దకు వెళ్లాలో తెలియని వారు ఇప్పుడు హైడ్రా ద్వారా తమ సమస్యలు చెప్పి పరిష్కారం పొందుతున్నారు. ముఖ్యంగా ముంపు, నీటి నిల్వ, డ్రైనేజీ సమస్యలకు ఇది సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది.’ ప్రజల సమస్యలను సమగ్రంగా విశ్లేషించి, తక్షణమే పరిష్కరించడమే హైడ్రా లక్ష్యమని అందరూ గుర్తు చేశారు.