Sitarama Project Pump House : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటలో భాగంగా సీఎం పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక అంతకుముందు సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించగా.. ములకలపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్ హౌస్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి నీళ్లను వదిలారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు పథకం కింద 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 3.45 లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టుకు నీరివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే పనుల్లో వేగం పెంచి ఈరోజు మూడు పంపు హౌస్‌లు ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్‌లో పాల్గొననున్నారు.
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం కింద నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు రాజీవ్‌సాగర్, ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాలను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పునరాకృతిలో భాగంగా నిర్మాణంలో ఉన్న రెండు ఎత్తిపోతల పథకాల స్థానంలో ‘సీతారామ’కు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2016 ఫిబ్రవరి 16న రూ.7,926 కోట్లతో దీనికి పరిపాలనా అనుమతి ఇచ్చింది. 2018లో ఈ అంచనా వ్యయం రూ.13,057.98 కోట్లకు పెరిగింది. ఇప్పటికే చేపట్టిన పనులకు పెరిగిన ధరలు, ఇంకా టెండర్లు పిలవాల్సిన డిస్ట్రిబ్యూటరీ పనులకు కలిపి సుమారు రూ.18,600 కోట్ల వ్యయమవుతుందని అంచనా. ఇప్పటి వరకు రూ.7,919.65 కోట్లు ఖర్చుచేయగా సుమారు మరో రూ.పదివేల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది.