Site icon HashtagU Telugu

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం.. ఇప్పటికే మంత్రులందరినీ ప్రచారంలోకి దిగాలని ఆదేశించారు. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల వంటి ప్రతిష్టాత్మక అంశాలను కూడా కొంత పక్కనపెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచార బరిలోకి దిగారు. సీఎం ఎంట్రీ తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల పోరు ఏకపక్షంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీఆర్ఎస్‌ సిట్టింగ్ సీటుపై గురి

గతంలో వరుసగా మూడుసార్లు దివంగత నేత మాగంటి గోపీనాథ్ గెలిచిన ఈ సీటును ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యమంత్రి అక్టోబర్ 28 నుంచే ప్రచారం ప్రారంభించారు. వ్యూహాత్మకంగా ఆయన మొదట కమ్మ సామాజిక వర్గ నాయకులతో భేటీ అయ్యారు.

సినీ కార్మికులకు కీలక హామీ

ప్రచారంలో భాగంగా యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సినీ కార్మికుల కోసం జరిగిన సన్మాన సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులకు కీలక హామీ ఇచ్చారు.

సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు పెద్ద నిర్మాతలు, హీరోలు తన వద్దకు వస్తున్నారని పేర్కొంటూ.. పెంచిన ఆదాయంలో 20 శాతం వాటాను తప్పనిసరిగా కార్మికులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ 20 శాతం వాటాను కార్మికుల కుటుంబాల సంక్షేమ నిధి (వెల్ఫేర్ ఫండ్‌) కింద వారికి నగదు బదిలీ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు సంబంధించి జీవో (GO) ఇస్తుందని అధికారులకు వేదికపై నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ హామీతో సినీ కార్మికుల్లో భారీ జోష్ నిండినట్లు సమాచారం.

Also Read: President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఉన్న ఈ మ‌హిళ ఎవ‌రో తెలుసా?

కాంగ్రెస్ నాయకత్వ ప్రణాళిక

జూబ్లీహిల్స్‌లో దాదాపు 30,000 కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. ఈ వర్గానికి చెందిన నాయకులతో సీఎం సమావేశమై, వారి డిమాండ్లను నెరవేర్చేందుకు హామీలు ఇచ్చారు. ఈ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి కన్సాలిడేట్ చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వం ఉపఎన్నిక బాధ్యతలను ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున అప్పగించింది. ఉదాహరణకు యూసుఫ్‌గూడ డివిజన్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్.. రెహమత్ నగర్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు.

సీఎం ప్రచార షెడ్యూల్

సీఎం రేవంత్ రెడ్డి రెండు దశల్లో ప్రచారం చేయనున్నారు. మొదటి దశ అక్టోబర్ 30, 31 తేదీలలో, రెండో దశ నవంబర్ 4వ తేదీలో ఉంటుంది. దీనితో పాటు భారీ బహిరంగ సభ, పలు చోట్ల రోడ్ షోలలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి మొత్తం ఆరు డివిజన్లలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. నవంబర్ 9వ తేదీన షేక్‌పేట్ ర్యాలీతో ఆయన ప్రచారం ముగుస్తుంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్‌ నవీన్ యాదవ్‌పై చేస్తున్న ‘రౌడీషీట్’ ఆరోపణలకు కొంతవరకు బ్రేక్ పడే అవకాశం ఉందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో గెలుపు అనేది కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు రెఫరెండంగా ఉంటుందని పార్టీ భావిస్తోంది.

Exit mobile version