CM Revanth Reddy : హైదరాబాద్‌లో వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. అమీర్‌పేట్ బుద్ధనగర్, మైత్రి వనం, గంగూబాయి బస్తీ వంటి ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా అవగాహన చేసుకున్నారు.
బుద్ధనగర్‌లో డ్రైనేజ్ సిస్టంను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజ్ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో నీరు సరిగా వెళ్లక ఇరుకుగా మారి ముంపు సమస్య తీవ్రతరమవుతోందని గమనించారు. వెంటనే డ్రైనేజ్ సిస్టంను స్ట్రీమ్‌లైన్ చేసి, వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Traffic Alert: హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: వార్-2 ఈవెంట్‌తో యూసుఫ్‌గూడలో రూట్ మార్పులు
అదే ప్రాంతంలో పక్కనే ఉన్న గంగూబాయి బస్తీ కుంటను కొంతమంది పూడ్చివేసి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని స్థానికులు సీఎంకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికే వెళ్లి పరిశీలించిన సీఎం, కుంట ప్రాంతాన్ని పునరుద్ధరించడంతో పాటు ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ సూచించారు.
తరువాత మైత్రివనం ప్రాంతంలో ఇటీవల నిలిచిపోయిన వరద నీటి సమస్యపై సీఎం స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ పర్యటనలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తో పాటు పలు విభాగాల అధికారులు సీఎం వెంట ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.