Engineers Day: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీర్స్ డే (Engineers Day) సందర్భంగా రాష్ట్ర ఇంజనీర్లకు, విద్యార్థులకు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి మేధో శక్తి, అంకితభావం, కష్టమే మానవాళి మనుగడకు, దేశాభివృద్ధికి మూలమని ఆయన కొనియాడారు. భారత ఆర్థికాభివృద్ధికి బలమైన పునాదులు వేసిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సెప్టెంబర్ 15ను పురస్కరించుకుని ఆరోజున ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నామని సీఎం గుర్తు చేశారు.
విశ్వేశ్వరయ్య సేవలకు సీఎం నివాళులు
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరుగా, దార్శనికుడిగా, విద్యావేత్తగా, నిపుణుడిగా, పారిశ్రామిక ప్రగతికి చోదకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారని అన్నారు. ఆయన అత్యుత్తమ ఇంజనీరింగ్ సాంకేతికతతో వివిధ రంగాలలో చేసిన కృషి భారతదేశ ఇంజనీరింగ్ రంగానికి ఒక ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదల నుంచి రక్షించడానికి ఆయన రూపొందించిన జల నియంత్రణ ప్రణాళికలు, చేపట్టిన నిర్మాణాలు ఎంతగానో ప్రశంసనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్ భవిష్యత్తుకు ఆయన వేసిన పునాదులు ఇప్పటికీ మనకు మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పారు.
Also Read: BCCI: భారత్- పాక్ మ్యాచ్ జరగకుంటే.. బీసీసీఐకి ఎంత నష్టం?
రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలోని ఇంజనీరింగ్ విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు అందరూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించి, తెలంగాణను సాంకేతికంగా మరింత ముందుకు నడిపించాలని ఆయన కోరారు. ఆధునిక సాంకేతికతలను ఉపయోగించుకుని, కొత్త ఆవిష్కరణలను చేపట్టాలని, తద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకురావాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మౌలిక వసతుల కల్పన, పారిశ్రామికాభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. ఈ రంగాలలో ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని, వారి సహకారం లేకుండా ఈ లక్ష్యాలను సాధించడం అసాధ్యమని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు వారి చేతుల్లో ఉందని, తమ నైపుణ్యాలతో, అంకితభావంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలిపాలని కోరారు. ఇంజనీర్స్ డే అనేది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదని, ఇంజనీర్ల కృషిని గుర్తించి, గౌరవించే రోజు అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా వారందరి సేవలకు, శ్రమకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా వారు మరింత ఉత్సాహంతో పని చేసి దేశాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.