Site icon HashtagU Telugu

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ ప్రశంసలు!

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి అద్భుత విజయాన్ని అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఏఐసీసీ (AICC) నేత రాహుల్ గాంధీ శనివారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం పట్ల రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేస్తూ గత రెండేళ్లలో జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో కాంగ్రెస్ గెలిచిన రెండవ అసెంబ్లీ స్థానం ఇదేనని కొనియాడారు.

ప్రజల మద్దతు స్పష్టం

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి లభించిన 25,000 ఓట్ల భారీ మెజారిటీ, బీజేపీ డిపాజిట్ కోల్పోవడం వంటివి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న బలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. స్థానిక సంస్థలు ముఖ్యంగా కీలకమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇదే గెలుపు ఊపును, సమష్టి సంకల్పాన్ని కొనసాగించాలని ఆయన రేవంత్ రెడ్డికి, రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఈ రెండు ఎన్నికల పోరాటాల్లోనూ విజ‌యం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీసీ రిజర్వేషన్లు.. పాత పద్ధతికే మొగ్గు

స్థానిక ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం కోటా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులపై రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు రిజర్వేషన్ల 50 శాతం పరిమితిని పాటించాలని స్పష్టం చేసినందున బీసీలకు 25 శాతం కోటా ఉన్న పాత రిజర్వేషన్ల ఫ్రేమ్‌వర్క్‌లో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ వేలం జ‌రిగే తేదీ, దేశం ఇదే!

అధిష్టానం గ్రీన్ సిగ్నల్

అయితే ప్రత్యామ్నాయంగా బీసీలకు అధిక ప్రాతినిధ్యం కల్పించేందుకు, 42 శాతం పార్టీ టికెట్లను ఆ సామాజిక వర్గానికే కేటాయించేందుకు రేవంత్ రెడ్డి అధిష్టానం నుండి అనుమతి పొందారు. ఈ ప్రతిపాదనను రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఆమోదించారు. పాత రిజర్వేషన్ విధానాన్ని ఉపయోగించి ముందుకు సాగాలని రేవంత్ రెడ్డికి సూచించారు.

తక్షణ ఎన్నికలకే మొగ్గు

జూబ్లీహిల్స్ విజయం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి అనుకూలమైన బలమైన పవనాన్ని సృష్టించిందని, ఈ సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకునేందుకు స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఆలస్యం చేయకుండా నిర్వహించడం సరైన సమయమని రేవంత్ రెడ్డి ఏఐసీసీ నాయకత్వానికి తెలిపారు.

నిర్ణయం నవంబర్ 17న

స్థానిక సంస్థల ఎన్నికలను డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించే ప్రణాళికలను రేవంత్ రెడ్డి జాతీయ నాయకత్వానికి వివరించారు. రిజర్వేషన్ల అమలులో ఎదురవుతున్న న్యాయపరమైన సవాళ్లను ఆయన ఖర్గే, వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. నవంబర్ 24 లోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అంతిమ నిర్ణయం తీసుకోవడానికి నవంబర్ 17న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుందని రేవంత్ రెడ్డి కేంద్ర నాయకులకు తెలియజేశారు.

Exit mobile version