. కేసీఆర్‌కు మరోసారి అధికారం దక్కనివ్వను
. బీఆర్ఎస్ గతం కాంగ్రెస్ భవిష్యత్తు అన్న రేవంత్ రెడ్డి
. కేసీఆర్ నన్ను జైలుకు పంపించి నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాడు
Congress : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను కొడంగల్ బిడ్డనని, ఇదే గడ్డ మీద నిలబడి స్పష్టంగా చెబుతున్నానని, రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్‌తో పాటు కల్వకుంట్ల కుటుంబం తిరిగి అధికారంలోకి రాకుండా చేయడమే తన జీవిత లక్ష్యమని, ఇదే తన శపథమని ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన సర్పంచ్‌ల సన్మాన సభలో పాల్గొన్న సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోనివ్వనని, ఇదే తన సవాల్ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌కు గతమే మిగిలిందని, తెలంగాణ భవిష్యత్తు పూర్తిగా కాంగ్రెస్‌దేనని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80కి పైగా సీట్లు సాధిస్తుందని అంచనా వేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి అసెంబ్లీ స్థానాలు 153కు పెరిగితే, కాంగ్రెస్ 100కు మించి సీట్లు గెలుస్తుందని గట్టిగా చెప్పారు. “ఇది ఊహ కాదు… రాసిపెట్టుకోండి. రెండోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ఇదే నా సవాల్” అంటూ సభలో ఉత్సాహాన్ని నింపారు.
కేసీఆర్ పదేళ్ల పాలనపై సీఎం తీవ్ర విమర్శలు చేశారు. దశాబ్దకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టులను కావాలనే నిర్లక్ష్యం చేశారని, బీఆర్ఎస్ పాలనలో ఆ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బాధ్యత పూర్తిగా కేసీఆర్‌దేనని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఎదురైన కష్టాలను కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కేసీఆర్ తనను జైలుకు పంపించారని, తన కుటుంబ సభ్యులను వేధించారని ఆరోపించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమ నాయకుడినని చెప్పుకునే వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని ప్రశ్నించారు. “మేము మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడగలం. కానీ మర్యాద కోసం మౌనంగా ఉన్నాం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ సహనాన్ని బలహీనతగా భావించొద్దని హెచ్చరించారు. కేసీఆర్‌కి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటారని, కానీ ఆ అనుభవం ప్రజలకు ఏం ఉపయోగపడిందని ప్రశ్నించారు.
పగ సాధించాలంటే తాను కూడా చేయగలనని, కానీ అలా చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో వెనక్కి తగ్గానని సీఎం తెలిపారు. తాను ప్రమాణ స్వీకారం చేసినప్పుడే కేసీఆర్ రాజకీయంగా కూలిపోయారని, అంతకంటే పెద్ద శిక్ష మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫాంహౌస్‌ను బందీఖానాలా మార్చుకున్నారని, జైలుకు పంపినా పరిస్థితిలో మార్పు ఉండదని వ్యంగ్యంగా అన్నారు. నల్లమల నుంచి రాజకీయ ప్రస్థానం మొదలై జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసి చివరకు ముఖ్యమంత్రిని అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏ అంశంపైనైనా చర్చించేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. కేసీఆర్ వయస్సును గౌరవిస్తామని, ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరై సూచనలు చేయాలని పిలుపునిచ్చారు. ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ కార్యాలయాల్లో ప్రెస్‌మీట్‌లు పెట్టడం కాకుండా, ప్రజా సమస్యలపై సభలో మాట్లాడాలని సూచించారు.
