CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు బహిరంగ సవాల్ విసిరారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదం, రైతుల సంక్షేమం, రెండు ప్రభుత్వాల హయాంలో తీసుకున్న నిర్ణయాలపై శాసనసభలో సమగ్ర చర్చకు రావాలని ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సవాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రజా భవన్‌లో నీటిపారుదల శాఖ మంత్రి త్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా బేసిన్ జలాల విభజనపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. “కేసీఆర్ అనుభవాన్ని మేం గౌరవిస్తాం. తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే సూచనలు ఆయన నుంచి వస్తే తప్పక పరిగణనలోకి తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిపుణుల అభిప్రాయాలు, స్టేక్‌హోల్డర్ల సలహాలతో సభలో అర్థవంతమైన చర్చ జరపడానికి సిద్ధం” అని ఆయన పేర్కొన్నారు.
Also Read: IND vs ENG 3rd Test: ఇంగ్లాండ్ జట్టులోకి జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ.. కలిసొస్తుందా?
“మీరు శాసనసభ సమావేశాలు పెట్టాలని స్పీకర్‌కు ఎప్పుడు లేఖ రాసినా మేం సిద్ధం. మీ హయాంలో, మా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై బహిరంగంగా చర్చిద్దాం. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా, ఎలాంటి గందరగోళం లేకుండా, ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటాం” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే, ఆయన నిర్ణయించిన తేదీన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మంత్రుల బృందాన్ని పంపి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని, అవసరమైతే తాను స్వయంగా హాజరవుతానని సీఎం ప్రకటించారు. “కాదు కూడదు, నేనూ రావాలంటే, ఎర్రవల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశానికి రావడానికి సిద్ధం. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడమే మా ఉద్దేశం,” అని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టబోమని, రాష్ట్ర హక్కుల కోసం దేవుడు ఎదురొచ్చినా నిటారుగా నిలబడి పోరాడతామని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఈ సవాల్‌పై కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.