Site icon HashtagU Telugu

CM Revanth Reddy: అందుకే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం: CM రేవంత్

CM Revanth Reddy

CM Revanth Reddy

CM revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వందేళ్ల బీసీల ఆకాంక్షను నెరవేర్చిందని ప్రకటించారు. హైదరాబాద్‌లో బీసీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, అణగారిన వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడంలో పార్టీ దృఢ సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్‌లను ఒక నెలలో ఖరారు చేయాలని గడువు విధించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ 42% రిజర్వేషన్‌ను అమలు చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. “బీసీలకు రిజర్వేషన్ కల్పించడం కోసం మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఈ రిజర్వేషన్‌లు బీసీ సమాజానికి రక్షణ కవచంలా ఉంటాయి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది” అని ఆయన బీసీ నేతలతో అన్నారు.

ఈ నిర్ణయం రాష్ట్రంలోని బీసీ సమాజంలో ఆనందాన్ని నింపింది. దశాబ్దాలుగా రాజకీయ, సామాజిక అవకాశాల్లో సమానత్వం కోసం పోరాడుతున్న బీసీలకు ఈ రిజర్వేషన్ ఒక మైలురాయిగా నిలుస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు. “ఈ చర్య బీసీలకు రాజకీయంగా బలాన్ని ఇవ్వడమే కాకుండా, స్థాన స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచుతుంది” అని ఒక బీసీ నాయకుడు తెలిపారు.

Also Read: Iga Swiatek: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా స్వైటెక్‌.. 2017 నుంచి కొత్తవారే ఛాంపియ‌న్స్‌!

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అణగారిన వర్గాల ఉన్నతి కోసం కట్టుబడి ఉందని, ఈ రిజర్వేషన్ నిర్ణయం ఆ దిశగా ఒక పెద్ద అడుగు అని పేర్కొన్నారు. హైకోర్టు గడువు ప్రకారం.. రిజర్వేషన్‌ల ఖరారు ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాక, ఈ రిజర్వేషన్‌లు బీసీ సమాజానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక శాఖల్లో సముచిత స్థానం కల్పిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఎం బీసీ నేతలను ఉద్దేశించి ఈ రిజర్వేషన్‌లను సమర్థవంతంగా అమలు చేయడానికి, అలాగే వాటిని భవిష్యత్తులో కాపాడుకోవడానికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. “మనం కలిసి పనిచేస్తే, ఈ రిజర్వేషన్‌లు బీసీ సమాజానికి శాశ్వత బలాన్ని ఇస్తాయి,” అని ఆయన అన్నారు. ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలైతే.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.