CM Revanth: దావోస్ పర్యటన అనంతరం తెలంగాణకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో ప్రజా పాలన పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రేపట్నుంచి నాలుగు పథకాలను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ పథకాలపై సీఎం రేవంత్ ఆయా మంత్రులు, అధికారులతో చర్చించారు. పథకాల అమలులో పారదర్శకత ఉండాలన్నారు. గ్రామ సభల్లో జరిగిన గొడవల గురించి ఆరా తీశారు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే పథకాలు దక్కాలని ఈ సందర్భంగా సీఎం మంత్రులకు, అధికారులకు సూచించారు.
రేపట్నుంచి నాలుగు పథకాలు అమలు: సీఎం రేవంత్
ఈ సమీక్షలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించబోతున్న విషయంపై సీఎం చర్చించారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేయాలని సూచించారు. నాలుగు పథకాలకు ఒక్కో పథకానికి ఒక్కో అధికారి చొప్పున గ్రామానికి నలుగురు మండలస్థాయి అధికారులను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి మొదటివారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రంలోని లబ్ధిదారులకు పథకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Meerpet Murder Case : వీడిన మాధవి మర్డర్ మిస్టరీ.. హీటర్‌తో పొటాషియం హైడ్రాక్సైడ్‌లో ఉడికించి మరీ..
మార్చి 31లోపు నాలుగు పథకాలు వంద శాతం అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దని, అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఈ సమీక్షలో దావోస్‌లో జరిగిన ఒప్పందాల గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది.