Site icon HashtagU Telugu

CM Revanth Reddy: మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్

Cm Revanth Launched Mahalak

Cm Revanth Launched Mahalak

Subsidy Gas Cylinder and Free Electricity Schemes launch: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో ఈరోజు మరో కీలక అడుగు ముందుకు పడింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాలు అమలు చేస్తుండగా, ఇవాళ మరో రెండింటికి శ్రీకారం చుట్టింది. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మహాలక్ష్మిలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లాంఛనంగా ప్రారంభించారు. చేవెళ్లలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఈ పథకాలు ప్రారంభించాలని తొలుత భావించినా, ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ అమల్లోకి రావడంతో వేదిక మార్చారు. చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటన రద్దు కావడంతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని   తెలిపారు. పేద‌ల‌పై భారం త‌గ్గించాల‌ని రూ. 500ల‌కే గ్యాస్ సిలిండ‌ర్ ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారంద‌రికీ ఉచిత క‌రెంట్ ఇస్తామ‌న్నారు. అర్హ‌త ఉండి ఎవ‌రైనా ద‌ర‌ఖాస్తు చేయ‌క‌పోయి ఉంటే మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మండ‌ల కార్యాల‌యాల్లోకి వెళ్లి ప్ర‌జాపాల‌న అధికారికి ఎప్పుడైనా ద‌ర‌ఖాస్తు ఇవ్వొచ్చు అని సీఎం సూచించారు. ఇప్ప‌టికే రెండు గ్యారెంటీల‌ను అమ‌లు చేశామ‌ని, ఇవాళ మ‌రో రెండు గ్యారెంటీల‌ను ప్రారంభించామ‌ని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిందన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పటికీ హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.

మన దేశంలో కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పెరిగిన ధరల నుంచి సామాన్యులకు, మహిళలకు ఊరట ఇచ్చేందుకు గృహజ్యోతి పథకాన్ని ప్రకటించినట్లు తెలిపారు. రూ.500కే సిలిండర్ ద్వారా రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన అభయహస్తం గ్యారంటీల్లో మరో రెండు పథకాలకు శ్రీకారం చుట్టింది. సచివాలయంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు ప్రారంభించారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇదే పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని ఇవాళ అందుబాటులోకి తీసుకువచ్చింది. మరోవైపు ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచిన రేవంత్ సర్కార్ తాజాగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ స్కీమ్‌ను ప్రారంభించింది.