- ‘భూభారతి’ కార్యక్రమం అమలులో కొన్ని జిల్లాల్లో అవినీతి నీడలు
- అడిషనల్ కలెక్టర్లు, ఇతర రెవెన్యూ అధికారులు అక్రమ వసూళ్లు
- ప్రజావాణి లో లంచాలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు
తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’ కార్యక్రమం అమలులో కొన్ని జిల్లాల్లో అవినీతి నీడలు ముసురుకోవడంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. క్షేత్రస్థాయిలో రైతుల భూ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాల్సిన అడిషనల్ కలెక్టర్లు, ఇతర రెవెన్యూ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూమి రికార్డులు, పట్టా మార్పిడి లేదా ఇతర సాంకేతిక సవరణలు అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ, ఫైల్‌పై సంతకం పెట్టేందుకు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. సామాన్య రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటూ, వారిని ఇబ్బందులకు గురిచేసే అధికారులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. భూభారతి వంటి పారదర్శక వ్యవస్థలో కూడా అవినీతికి తావుండటం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏ అధికారి వద్ద ఎన్ని ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి? అవి ఎందుకు ఆగిపోయాయి? అనే అంశాలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని, కారణం లేకుండా సంతకాలు నిలిపివేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎంఓ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు సంబంధించి ప్రభుత్వం అంతర్గత విచారణకు కూడా ఆదేశించింది. జిల్లాల్లోని అడిషనల్ కలెక్టర్లు తమ పరిధిలోని ఫైళ్లను నిర్ణీత గడువులోగా క్లియర్ చేయాలని, లేనిపక్షంలో సంజాయిషీ ఇచ్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతుల భూమి హక్కులను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికి అడ్డుపడే వారిపై ఏసీబీ (ACB) లేదా ఇతర నిఘా విభాగాల ద్వారా విచారణ జరిపి సర్వీసు నుంచి తొలగించడానికి కూడా వెనుకాడబోమని ప్రభుత్వం సంకేతాలిచ్చింది. ఈ కఠిన చర్యల వల్లనైనా క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
