ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు (Bankacherla Project)పై తాజాగా చర్యలు చేపట్టడంతో తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసే ఈ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించే సాహసం “చారిత్రక మోసం” ఫలితమని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ లు జగన్ రెడ్డితో చేతులు కలిపి తెలంగాణ నీటిని, భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ ద్రోహ విత్తనం అప్పుడే నాటబడిందని, ఇప్పుడు అది విషవృక్షంగా పెరిగి తెలంగాణ హక్కులపై దాడి చేస్తున్నదని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Abhishek Sharma: రూ. 10 కోట్లు పెట్టి కారు కొనుగోలు చేసిన టీమిండియా క్రికెటర్!
“ఈ తరం ఎప్పటికీ రాజీ పడదు. తెలంగాణ నీరు, నిధులు, నియామకాలు – ఎక్కడా రాజీ ఉండదు” అని హెచ్చరించారు. “మేము కోర్టుల్లో పోరాడతాం, వీధుల్లో పోరాడతాం, చివరి ఊపిరి వరకు పోరాడతాం” అని స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణ రైతుల హక్కులకు, ప్రజల జీవనాధారమైన గోదావరి నీటికి ఎలాంటి భంగం కలిగినా దాన్ని సహించబోమని హెచ్చరించారు. “మన రక్తనాళాల్లో మద్యం కాదు, రక్తమే ప్రవహిస్తోంది. ధైర్యం ఉంది, న్యాయం ఉంది, తెలంగాణ ఉంది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
గోదావరి జలాలపై ఈ వివాదం కేవలం రాజకీయపరమైనది మాత్రమే కాదు, తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రాణప్రశ్న. తెలంగాణ రైతులు, తల్లులు, పిల్లలు ఆధారపడే ప్రతి చుక్క నీరు వారి జీవనాధారం అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. “మన గోదావరి ఒక్క చుక్క నీరు కూడా ఎవరికీ వదలము,” అని ఆయన తేల్చిచెప్పారు. ఆయన పిలుపుతో తెలంగాణలో ప్రజాస్వామ్య శక్తులు మళ్లీ మేల్కొంటున్నాయి. రాష్ట్ర హక్కుల కోసం, గోదావరి జలాల రక్షణ కోసం మరోసారి ప్రజా ఉద్యమం తారాస్థాయికి చేరే సూచనలు కనబడుతున్నాయి. “జై తెలంగాణ!” అంటూ ఆయన ప్రసంగం ముగించారు.
