Site icon HashtagU Telugu

CM Revanth: వర్షాకాలం సీజన్ పై రేవంత్ అలర్ట్.. అధికారులకు కీలక ఆదేశాలు

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth: వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.  ఈ సీజన్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫిజికల్ పోలీసింగ్ విధానం అనుసరించాలని, సిబ్బంది కొరత ఉంటే హోమ్ గార్డులను రిక్రూట్‌ చేసుకోవాలని చెప్పారు.

ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్‌గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను ఇంటిగ్రేట్ చేయాలని, ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటిని వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. నగరంలో వరద తీవ్రత ఉండే 141 ప్రాంతాలను గుర్తించినట్టు ఈ సందర్భంగా అధికారులు వివరించగా, వరద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టంతో పాటు నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వరద వెళ్లేలా వాటర్ హార్వెస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులకు వివరించారు.  ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు.