Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. 21 రోజుల పాటు వేడుకలు..!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు (Telangana Formation Day), పదేండ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని, వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం సహా ప్రతి రంగంలో

Published By: HashtagU Telugu Desk
Telangana Formation Day

Whatsapp Image 2023 05 20 At 9.35.55 Pm

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు (Telangana Formation Day), పదేండ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని, వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లె పల్లెన ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) శనివారం అధికారులను ఆదేశించారు. 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాల ప్రారంభ వేడుకలను జూన్ 2న ‘డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’లో నిర్వహించాలని సీఎం (CM KCR) నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల నిర్వహణ, కార్యాచరణ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో అవతరణ దినోత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించాలో ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గొప్ప సందర్భం. ఒకనాడు అనేక అవమానాలకు, అపోహలకు గురైన తెలంగాణ నేడు అత్యద్భుతంగా వెలుగొందుతున్నది. విద్యుత్తు, వ్యవసాయంతోపాటు సాగు నీరు సహా ప్రతి రంగంలో దేశానికే ఆదర్శంగా ప్రగతిని నమోదు చేసుకుంటూ పోతున్నది.

నేడు స్వయంపాలన ఫలాలు ప్రజలకు అందుతున్నవి. పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని పల్లె పల్లెనా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలి. ఒకనాడు కరెంటు కోతలతో కారు చీకట్లలో మగ్గిన తెలంగాణలో నేడు విద్యుత్ రంగాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవడంతో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతున్నది. 24 గంటల విద్యుత్ ను రైతాంగానికి ఉచితంగా, నిరంతరాయంగా అందిస్తున్నాం. ఇదంతా ఎంతగానో కష్టపడితే తప్ప సాధ్యం కాలేదు. ఇవే విషయాలను ప్రజలకు వివరించాలి. గత పాలకుల నిర్లక్ష్య వైఖరితో కరెంటు లేక తెలంగాణలో ఎక్కడ చూసినా ఇన్వర్టర్లు, కన్వర్టర్లే కనిపించేవి. వంగిపోయిన కరెంటు స్తంభాలు ప్రమాదాలకు కారణమవుతుండేవి. వేలాడే కరెంటు తీగలు ప్రజల ప్రాణాలను హరించేవి. ఇండ్ల మీది నుంచే విద్యుత్ లైన్లు పోయినా నాడు పట్టించుకునే దిక్కే లేకుండేది. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగునా దృఢంగా నిలిచిన కరెంటు స్తంభాలు, విద్యుత్ ను నిరంతరాయంగా ప్రసారం చేస్తున్న నాణ్యమైన కరెంటు వైర్లు, అడుగడుగునా ట్రాన్స్ ఫార్మర్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గత పాలనలో విస్మరించబడిన విద్యుత్ ఉత్పాదన, ప్రసార వ్యవస్థలను దార్శనికతతో, పట్టుదలతో పటిష్టపరుచుకోవడం ద్వారానే విద్యుత్ విజయం సాధ్యమైంది. ఈ విషయం తెలంగాణ ప్రజలకు అనుభవంలోకి వచ్చిందని సీఎం అన్నారు.

Also Read: Gayatri Jayanti 2023: మే 31న గాయత్రి జయంతి..గాయత్రి దేవీ పూజ విధానం

విద్యుత్ రంగం మాదిరే తెలంగాణ ప్రభుత్వం పటిష్టపరిచిన వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ప్రతి రంగంలో సాధించిన అభివృద్ధిని పేరు పేరునా ప్రజలకు పలు ప్రసార మాధ్యమాలు, మార్గాల ద్వారా చేరవేయాలి. స్వరాష్ట్ర సాధన ఫలాలను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలతో ఈ మూడు వారాల పాటు మమేకం కావాలి. వారి భాగస్వామ్యంతో పల్లె నుంచి పట్నం దాకా దశాబ్ది ఉత్సవాలను ఆటాపాటలతో పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని సీఎం పునరుద్ఘాటించారు.

అదే సందర్భంలో జూన్ 2 ప్రారంభం నాడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నిర్వహించే వేడుకలను డా. బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించాలని సీఎం నిర్ణయించిన నేపథ్యంలో సచివాలయంలో స్టేజి ఏర్పాటు సహా పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, జాతీయ జెండా ఎగురవేయడం తదితర అధికార కార్యక్రమాలు నిర్వహణకు సంబంధించి సీఎం కేసీఆర్ చర్చించారు. ఆహ్వానితులకు పార్కింగ్ సౌకర్యం, అతిథులకు ‘హైటీ’ ఏర్పాటు వంటి కార్యక్రమాలను ఎక్కడ, ఎట్లా నిర్వహించాలో వివరిస్తూ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు సహా రాష్ట్రవ్యాప్తంగా 21 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాల ఏర్పాట్ల గురించి సీఎం చర్చించారు.

  Last Updated: 21 May 2023, 06:33 AM IST