Site icon HashtagU Telugu

KCR Will contest: కేసీఆర్ చూపు.. మునుగోడు వైపు!

Munugodu

Munugodu

ఎక్కడైతే సమర్థవంతమైనా నాయకత్వం ఉంటుందో.. అక్కడ మాత్రమే విజయం ఉంటుంది. ఈ సూత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సరిగ్గా యాప్ట్ అవుతుంది. రాజకీయ చదరంగంలో పావులు ఎలా కదపాలి? ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? అనే విషయాలు ఆయనకు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియవనే చెప్పాలి. ప్రత్యర్థుల ఆలోచనలు, రాజకీయ పరిస్థితులను పసిగట్టడంలో ఆయన ఎప్పుడు ముందుంటారని రాజకీయ విశ్లేషకుల మాట. తెలంగాణలో ముందస్తు గాలులు వీస్తుండటంతో దానికి తగ్గట్టుగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంపై ద్రుష్టి సారించినున్నట్టు, వచ్చే ఎన్నికల్లో ఆ స్థానం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారట. ఆయన గజ్వేల్ కాదనీ మునుగోడు నుంచి పోటీ చేయడానికి బలమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ కు అంతగా పట్టులేదు. బలమైన నాయకులు ఉన్నప్పటికీ ఓటు బ్యాంకు సాధించడంలో విఫలమవుతున్నారు. అందుకే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమాల ఖిల్లా నల్లగొండ పై ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. మునుగోడు బరిలో దిగి గెలిస్తే నల్లగొండ ఉమ్మడి జిల్లాపై మరింత పట్టు సాధించడం, పార్టీ పటిష్టత పెరగడం అధికార పార్టీకి ప్లస్ అవుతుందని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నట్టు సమాచారం. మునుగోడునే ఎంచుకోవడం మరో ప్రధాన కారణం కూడా ఉంది. ఆ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ రాగం ఎత్తుకోవడం, వచ్చే ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో సీఎం కేసీఆర్ కు కలిసివచ్చే అంశాలు కూడా.

రాజకీయ విశ్లేషకుల మాటను నిజం చేస్తూ.. సీఎం కేసీఆర్ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తాలతో భేటీ అయ్యారట. మునుగోడు నుంచి పోటీ చేస్తే పార్టీకి లాభాలేమిటి? కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఏవిధంగా చెక్ పెట్టాలి? అనే విషయాలను చర్చించారట. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మునుగోడు నుంచి బరిలో దిగొచ్చని అధికార పార్టీల నేతలు సైతం భావిస్తున్నారు. ఇక గజ్వేల్ నుంచి ప్రకాశ్ రాజ్ పోటీ చేసే అవకాశాలున్న కూడా ప్రచారం జరుగుతోంది. ఇంకొన్ని రోజులు గడిస్తేకానీ.. ఈ విషయాలపై మరింత స్పష్టత రానుంది.