Site icon HashtagU Telugu

KCR Vs Tamilisai : ‘రాజ్యాంగం’ ముసుగులో గుద్దులాట‌

Tamilisai Issue

Tamilisai Issue

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై, సీఎం కేసీఆర్ మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్నయుద్ధం జ‌రుగుతోంది. రాజ్ భ‌వ‌న్‌, ప్ర‌గ‌తి భ‌వ‌న్ మ‌ధ్య రాజ్యాంగంలోని సాంకేతిక అంశాల వారీగా వార్ న‌డుస్తోంది. టెక్నిక‌ల్ గా కేసీఆర్ స‌వ్వంగా చేస్తున్నాడ‌నే భావ‌న క‌లిగిస్తూనే, త‌మిళ సైకి చుక్క‌లు చూపిస్తున్నాడు. గ‌తంలో ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్, కేసీఆర్ ఒక‌టిగా దేనికైనా వెళ్లే వారు. ప‌లు సంద‌ర్భాల్లో `హై టీ`లు ఏర్పాటు చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ సీఎంల‌ను క‌లిపేందుకు త‌ర‌చూ విందు భేటీలు జ‌రిగేవి. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితిని ఇప్పుడు చూస్తున్నాం.తొలి మ‌హిళా గ‌వ‌ర్న‌ర్ గా త‌మిళ సై నియామ‌కం రెండున్న‌రేళ్ల క్రితం జ‌రిగింది. స్వ‌త‌హాగా ఆమె బీజేపీ కీల‌క నేత‌. మోడీ స‌ర్కార్ సూచ‌న మేర‌కు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ నామినేట్ చేసిన గ‌వ‌ర్న‌ర్ ఆమె. రాజ్యాంగం ప్ర‌కారం త‌మిళ సై తెలంగాణ తొలి పౌరురారులు. గ‌వ‌ర్న‌ర్ గా త‌మిళ సై బాధ్య‌త‌లు తీసుకున్న రోజు నుంచి కేసీఆర్ కినుక వ‌హించాడు. ఆమె దూకుడు తొలి రోజుల్లో సీఎంకు కంట‌గింపు క‌లిగించింది. అయిన‌ప్ప‌టికీ ఏడాది పాటు క‌లిసిమెలిసి ఉండేలా కేసీఆర్ ప‌లు కార్య‌క్ర‌మాల్లో మ‌మేకం అవుతూ వ‌చ్చాడు. రాజ్ భ‌వ‌న్లో గ్రీవెన్స్ మొదలు పెట్టినప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ పెరిగింది. యూనివ‌ర్సిటీల ఉప కుల‌ప‌తుల నియామాకం నుంచి నేరుగా ప్ర‌భుత్వంలోని విభాగ అధిప‌తుల‌తో రాజ్ భ‌వ‌న్ స‌మీక్ష‌ల‌కు ప్లాన్ చేసింది. స్వ‌యాన డాక్టర్ అయిన తమిళ సై ఆస్ప‌త్రుల ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. రాష్ట్రంలోని మారు మూల గిరిజ‌నుల‌తో మ‌మేకం అవుతూ స‌మాంత‌ర పాల‌న‌కు తెరదీశార‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ అనుమానించింది.

ఆ అనుమానం బ‌ల‌ప‌డేలా ఇటీవ‌ల ఎమ్మెల్సీల జాబితాను రాజ్ భ‌వ‌న్ తిరిగి పంప‌డం జ‌రిగింది. ప్ర‌త్యేకించి హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వ‌చ్చిన కౌశిక్ రెడ్డి నియామ‌కంపై రాజ్ భ‌వ‌న్ కొర్రీలు వేసింది. కోవిడ్ స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం వైఖ‌రిపై రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కు ఫిర్యాదుల వెనుక కూడా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మేయం ఉంద‌ని కేసీఆర్ సన్నిహితుల అనుమానం. కోవిడ్ ముందు నుంచే గ‌వ‌ర్న‌ర్‌, సీఎం మ‌ధ్య గ్యాప్ బాగా ఏర్ప‌డింది. ఇటీవ‌ల జ‌రిగిన గ‌ణ‌తంత్ర్య దినోత్స‌వాల సంద‌ర్బంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హరించిన తీరు ఇద్ద‌రి మ‌ధ్యా ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధానికి బ‌ల‌మైన సంకేతంగా నిలిచింది. ప‌బ్లిక్ కార్డెన్లో ఘ‌నంగా నిర్వ‌హించే ఆ వేడుక కేవ‌లం రాజ్ భ‌వ‌న్ కు ప‌రిమితం అయింది. ఆ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ గానీ, మంత్రులు గానీ అంద‌రూ హాజ‌రు కాలేదు. దీంతో సీఎం, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య గ్యాప్ పెరిగింది. స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ జాత‌ర‌కు హెలికాప్ట‌ర్ ను ఏర్పాటు చేయ‌కుండా ప్ర‌భుత్వం ఇరుకున పెట్టింది.
తాజాగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలేకుండానే అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతుండ‌డం వాళ్లిద్ద‌రి మ‌ధ్యా విభేదాల‌కు పరాకాష్ట‌గా ఉంది. కానీ, సాంకేతికంగా సీఎం కార్యాల‌యం ఇస్తోన్న వివ‌ర‌ణ‌ను ఎవ‌రూ కాద‌న‌లేరు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 176 (1) ప్రకారం అసెంబ్లీ ప్రొరోగ్‌ అయిన తర్వాత తిరిగి సమావేశ ప్రారంభం అయితే దాన్ని కొత్త సెషన్‌గా భావిస్తారు. ప్రొరోగ్‌ కాని పక్షంలో గత సభనే వాయిదా వేసి తిరిగి ప్రారంభం అయిన‌ట్టుగా ప‌రిగ‌ణిస్తారు. ఆ ప్ర‌కారం అయితే, గతేడాది అక్టోబర్‌లో చివరిసారిగా తెలంగాణ శాసనసభ ఎనిమిదో సమావేశం జ‌రిగింది. శాసనమండలి సమావేశం కూడా స‌మాంత‌రంగా నిర్వ‌హించ‌బ‌డింది. ఆ సమావేశాలు పూర్తయిన తర్వాత శాసనసభ ప్రొరోగ్‌ కాలేదు. అంటే, సోమ‌వారం ప్రారంభం అయిన స‌మావేశం గ‌త స‌భ పొడిగింపుగా ప్ర‌గ‌తిభ‌వ‌న్ చెబుతోంది. అందుకే, గవర్నర్‌ ప్రసంగం అనివార్యం అనే వాద‌న ఉత్ప‌న్నం కాద‌ని సాంకేతిక ప‌రిభాష‌ను వినిపిస్తోంది.

గ‌తంలోనూ ఇలాగే అనే స‌మావేశాలు ఉమ్మ‌డి ఏపీలో జ‌రిగాయ‌ని రికార్డుల‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్ త‌వ్వుతోంది. 1970లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్ల విజయభాసర్‌రెడ్డి ఆర్థిక మంత్రి. స్పీక‌ర్ గా బీవీ సుబ్బారెడ్డి ఉండేవారు. 1970 డిసెంబర్‌లో శాసన సభ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత మార్చిలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించారు. ఆనాడున్న‌ ఖండూబాయి దేశాయిని ప్రభుత్వం సమావేశాలకు ఆహ్వానించలేద‌నే విష‌యాన్ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ గుర్తు చేస్తోంది. ఆ తర్వాత జూలైలో జరిగిన అసెంబ్లీలో ఖండూబాయ్ ప్రసంగించారు.ఉమ్మ‌డి ఏపీలో 2013 మార్చి 13న అసెంబ్లీ జ‌రిగింది. ఆ తర్వాత 4 సిట్టింగులు కూడా జరిగాయి. 2014 ఫిబ్రవరి 10న బడ్జెట్‌ను ఆమోదించారు. అదే సెషన్‌లో జరిగిన సమావేశాలు కాబట్టి.. అప్పటి ప్రభుత్వం గవర్నర్‌ను ఆనాడు పిలువలేద‌ని రికార్డ్ చెబుతోంది. ఇక 2014 జూన్‌ 11న అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కొత్తగా ఏర్పడిన సభను సమావేశపరిచినప్పుడు గవర్నర్‌ ప్రసంగించారు. సుమారు ఏడాదిన్నర కాలంపాటు సభలో గవర్నర్‌ ప్రసంగం లేకుండానే సమావేశాలు ముగిసిన విష‌యం విదిత‌మే.

విభ‌జిత ఏపీలో 2019 డిసెంబర్‌ 17న అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. కానీ ప్రొరోగ్‌ చేయలేదు. తిరిగి 2020 జనవరిలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించి, ఆమోదించారు. ఆ సమయంలో గవర్నర్‌ ప్రసంగం లేదు. దీనికి కారణం కూడా ప్రొరోగ్‌ చేయకపోవడమే. 2020 జూన్‌ 16న తిరిగి సభను నిర్వహించినప్పుడు గవర్నర్‌ ప్రసంగించారు. ఇలా, ప్రోరోగ్ చేయ‌క‌పోతే, గ‌త సెష‌న్ కొన‌సాగుతున్న‌ట్టు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చెబుతున్నాయి. వాటి ఆధారంగా ఈ స‌మావేశాల్లో త‌మిళ సై ప్ర‌సంగం అవ‌స‌రంలేద‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వాదిస్తోంది. కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేంద్ర‌, రఘునంద‌న్‌, రాజాసింగ్‌లు మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా గ‌వ‌ర్న‌ర్ ప‌ట్ల సీఎం వ్య‌వ‌హ‌రిస్తున్నాడని ఆరోపించారు. దీంతో అసెంబ్లీ గంద‌ర‌గోళంగా మారింది. ఫ‌లితంగా ఆ ముగ్గుర్ని అసెంబ్లీ నుంచి బ‌హిష్క‌రించే వ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హారం వెళ్లింది. సీఎంను కాద‌ని రాష్ట్రంలో సమాంత‌ర పాల‌న సాగించేలా రాజ్ భ‌వ‌న్ చేసిన ప్ర‌య‌త్నాలు కూడా రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన‌వే. విచ‌క్ష‌ణాధికారాల‌తో యూనివ‌ర్సిటీ ఉప కుల‌ప‌తులు, ఎమ్మెల్సీల ఎంపిక త‌దిత‌రాల‌పై అభ్యంత‌ర పెట్ట‌వ‌చ్చు. అలాగే, రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా స‌మావేశాల‌ను పెట్టుకోవ‌చ్చు. విభాగాధిప‌తుల‌తో గ‌వ‌ర్న‌ర్ స‌మావేశం కావొచ్చు. చీఫ్ సెక్ర‌ట‌రీతో నేరుగా వివ‌రాల‌ను సేక‌రించుకునే వెసుల‌బాటు రాజ్యాంగం గ‌వ‌ర్న‌ర్ కు క‌ల్పించింది. ఇలా, గ‌వ‌ర్న‌ర్, సీఎం ఇద్ద‌రూ రాజ్యాంగ ప్ర‌కారం ఉండే సాంకేతిక అంశాల‌ను చూపుతూ ఆధిప‌త్య పోరును కొన‌సాగిస్తున్నారని స‌ర్వ‌త్రా వినిసిస్తోంది. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌, సీఎం మ‌ధ్య ఉన్న గ్యాప్ భ‌విష్య‌త్ లో ఎటు వైపు దారితీస్తుందో చూడాలి. ఇలాంటి ప‌రిస్థితి బీజేపీయేత రాష్ట్ర‌ల‌న్నింటిలోనూ క‌నిపిస్తుండ‌డం కొస‌మెర‌పు.