KCR on Modi: తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప‌డగొట్టే వ్యూహాలు: సీఎం కేసీఆర్‌

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టిన‌ట్టే తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప‌డేయాల‌ని బీజేపీ చూస్తుంద‌ని సీఎం కేసీఆర్ ఆందోళ‌న చెందారు. అలా చేస్తే, కేంద్ర ప్ర‌భుత్వాన్ని దించేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిదేళ్ల‌లో తొమ్మిది ప్ర‌భుత్వాల‌ను బీజేపీ ప‌డ‌గొట్టింద‌ని ఆరోపించారు.

  • Written By:
  • Updated On - July 2, 2022 / 03:02 PM IST

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టిన‌ట్టే తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప‌డేయాల‌ని బీజేపీ చూస్తుంద‌ని సీఎం కేసీఆర్ ఆందోళ‌న చెందారు. అలా చేస్తే, కేంద్ర ప్ర‌భుత్వాన్ని దించేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిదేళ్ల‌లో తొమ్మిది ప్ర‌భుత్వాల‌ను బీజేపీ ప‌డ‌గొట్టింద‌ని ఆరోపించారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ షావుకార్ల సేల్స్ మేన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బొగ్గు కాంట్రాక్ట్ విష‌యంలో ఆదానీకి మేలు చేయాల‌ని శ్రీలంక ప్ర‌భుత్వానికి ఫోన్ ద్వారా లాబీయింగ్ చేశార‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఒక సేల్స్ మేన్ త‌ర‌హాలో ప్ర‌ధాని మంత్రి వ్య‌వ‌హ‌రించార‌ని విమ‌ర్శించారు. ప్ర‌స్తుతం శ్రీలంక ప‌రిస్థితి ఎలా ఉందో తెలియ‌చేస్తూ, రైతులు ఆయ‌న‌కు ఉగ్ర‌వాదులుగా , ఏర్పాటు వాదులుగా క‌నిపిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. దేశంలోని అన్ని వ‌ర్గాలు మోడీ విధానాల కార‌ణంగా అసంతృప్తిగా ఉన్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి సిన్హాను బేగంపేట నుంచి జ‌ల‌విహార్ వ‌ర‌కు ర్యాలీగా ఆహ్వానించిన ఆయ‌న పార్టీ నేత‌ల‌తో స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంద‌ర్భంగా సిన్హాలాంటి ఉన్న‌త‌మైన వాళ్లు రాష్ట్ర‌ప‌తి అయితే దేశానికి హుందాత‌నం వ‌స్తుంద‌ని అన్నారు. ఆయ‌న గెలుస్తార‌న్న విశ్వాసం ఉంద‌ని ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

ప్ర‌ధాని మోడీ అంటే వ్య‌క్తిగ‌త ద్వేషంలేదంటూనే, మేధావిగా ఆయ‌న‌కు ఆయ‌నే భావిస్తుంటార‌ని వ్యక్తిగ‌త విమ‌ర్శ‌లు కురిపించారు. శాశ్వ‌తంగా ఆ ప‌ద‌విలో ఉంటాన‌ని భ్ర‌మ‌ప‌డుతున్నార‌ని ఎద్దేశా చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌త్ త‌ల‌దించుకునేలా మోడీ చేస్తున్నార‌ని ఆరోపించారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాలు మంచివైతే ఎందుకు వెన‌క్కు తీసుకున్నార‌ని నిల‌దీశారు. చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించుకుని దేశం ముందు త‌ల‌దించుకున్నార‌ని గుర్తు చేశారు. మేకిన్ ఇండియా అంటూ చైనా వ‌స్తువుల‌ను వాడుతున్నార‌ని విమ‌ర్శించారు. నిత్యావ‌స‌ర వ‌స్తువులు ధ‌ర‌లు సామాన్యుల‌కు అందుబాటులో లేకుండా చేశారు. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తిని నిలువునా మోసం చేస్తున్నార‌ని ఆరోపించారు. చైనా జీడీపీ, త‌ల‌స‌రి ఆదాయం ఎంతో చూడాల‌ని చుర‌క‌లంటించారు. ఉద్యోగులు, సైనికులు, నిరుద్యోగులు, రైతులు, సామాన్యులు, పేద‌లు అంద‌రూ మోడీ పాల‌న‌లో చితికిపోయార‌ని చెప్పారు.

న‌ల్ల‌ధ‌నం తీసుకొస్తాన‌ని చెప్పిన మోడీ షావుకారుల సేల్స్ మేన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని కేసీఆర్ దుయ్య‌బ‌ట్టారు. ఆనాడు మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు రూపాయి విలువ రూ. 68లు ఉంటే రాజ‌కీయం చేసిన మోడీ ఇప్పుడు రూపాయ విలువ రూ. 79ల‌కు పత‌నం అయిన విష‌యాన్ని మ‌రిచిపోయాడా? అంటూ ప్ర‌శ్నించారు. నేపాల్, బంగ్లాదేశ్ రూపాయి ప‌డిపోకుండా భార‌త్ రూపాయి ఎందుకు ప‌డిపోయిందో జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో చెప్పాల‌ని మోడీని నిల‌దీశారు. శ్రీలంక వేదిక‌గా జ‌రిగిన బొగ్గు లాబీయింగ్ విష‌యంపై ఆయ‌న మాట్లాడాల‌ని స‌వాల్ చేశారు. లేదంటే ఆయ‌న్ను దోషిగా భావిస్తామ‌ని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్ర‌సంగంలో మోడీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న చేసిన ప్ర‌ధాన అంశాలివి.

*8.8 శాతం నిరుద్యోగిత పెరిగింది. మీడియా స్వేచ్ఛ‌లో అట్ట‌డుగున ఉన్నాం. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలుతుంది.

*కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే ముందు, మేం అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాలి

*మేకిన్ ఇండియా అంటే కార్పొరేట్ కంపెనీల‌ను దేశ నుంచి పంపివేయ‌డ‌మేనా? చైనా జీడీపీ, త‌ల‌స‌రి ఆదాయం చూడండి

*క‌రోనా స‌మ‌యంలో హ‌ఠాత్తుగా లాక్ డౌన్ పెట్టి పేద‌ల‌ను న‌డిరోడ్డున నిల‌బెట్టారు. నోట్ల ర‌ద్దుతో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌ను బాధ‌లు పెట్టారు.

*ప్రజాస్వామ్యాన్ని ప్ర‌తి రోజూ ఖూనీ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 9 ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట్టారు. ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌కు ప్ర‌మాదం తెచ్చారు.

*ఎనిమిదేళ్ల మోడీ పాల‌న‌లో భారీ స్కామ్ లు జ‌రిగాయి. న‌ల్ల‌ధ‌నం తెచ్చి రూ. 15ల‌క్ష‌లు ప్ర‌తి ఒక్క‌రి ఖాతాలో వేస్తాన‌న్నారు. 15పైస‌లు కూడా వేయ‌లేదు.

*మ‌త విద్వేషాల‌తో దేశాన్ని క‌లుషితం చేస్తున్నారు. సెస్ రూపంలో 30ల‌క్ష‌ల కోట్లు రాష్ట్రాల నుంచి దోచుకుంటున్నారు. మాన‌వాభివృద్ధి సూచిక‌లో భార‌త్ నానాటికీ దిగజారుతుంది. హ్యాపీ ఇండెక్స్, హంగ‌ర్ ఇండెక్స్ లోనూ దారుణ ప‌రిస్థితుల్లో భార‌త్ ఉంది.

*జాతిపిత గాంధీని అవ‌మానించేలా మోడీ పాల‌న ఉంది. అమెరికా ఎన్నిక‌లంటే అహ్మ‌దాబాద్ ఎన్నిక‌ల‌ని మోడీ అనుకున్నారు. మ‌ళ్లీ ట్రంప్ వ‌స్తాడ‌ని మోడీ చెప్ప‌డం ఏమిటి? అమెరికా ప్ర‌జ‌లు త‌గిన బుద్ధి చెప్పారు.

*లౌకిక ప్ర‌భుత్వం కోసం తెలంగాణ ప్ర‌జ‌లు పోరాటాలు చేస్తారు. సిన్హాకు మ‌ద్ధ‌తు ఇస్తూ ఆయ‌న్ను గెలిపించేలా చూస్తాం.