ఒక వైపు గుజరాత్ మోడల్ ఇంకో వైపు మమత తరహా పాలిటిక్స్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ తెరలేపాడు. అందుకే, కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో జత కట్టాలని ఉవిళ్లూరుతున్నాడు. కానీ, కేసీఆర్ రాజకీయాన్ని ఢిల్లీ పెద్దలు నెమరు వేసుకుంటున్నాడు. నమ్మకమైన లీడర్ గా ఆయన్ను జాతీయ పార్టీలే కాదు..యూపీఏ పక్షాలు సంపూర్ణంగా విశ్వసించడంలేదని టాక్. అందుకే, కొత్త పార్టీ అంటూ మరో స్లాగన్ అందుకున్నాడు.కేవలం 17 లోక్ సభ స్థానాలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్. ఆయన ప్రధాన మంత్రి పదవిని ఆశించడం రాష్ట్ర రాజకీయ గేమ్ లో భాగం అనుకోవాలి. ఎందుకంటే, మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో ఎంఐఎం ఎప్పుడూ ఒకటి కి తక్కువ కాకుండా గెలుస్తోంది. ఇక మిగిలిన 16 స్థానాల్లో ప్రస్తుతం నాలుగు బీజేపీకి చెందినవి. గతంలోనూ కనీసం రెండు స్థానాలను తెలంగాణ నుంచి బీజేపీ కైవసం చేసుకునేది. ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు కూడా బీజేపీకి ఎప్పుడూ తెలంగాణ ప్రజల మద్ధతు ఉండేది. ఇక ఇప్పుడు దాని బలం పెరిగింది. అందుకు దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలతో పాటు 2019 సాధారణ ఎన్నికలను కూడా ప్రాతిపదికగా తీసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న తొమ్మిది స్థానాలు కూడా వస్తాయా? రావా? అనే పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
లోక్ సభ ఎంపీల బలం చూసుకుంటే కేసీఆర్ వేస్తోన్న జాతీయ రాజకీయాల అడుగు తెలంగాణను దాటే పరిస్థితి లేదు. మీడియాకు ఎంత చెబుతున్నప్పటికీ ఢిల్లీ స్ఠాయిలో లైట్ గానే తీసుకుంటున్నారు. జాతీయ నాయకునిగా మీడియా ఫోకస్ చేయాలని ఆయన పదేపదే కోరుతున్నాడు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఢిల్లీ పీఠం ఎక్కబోతున్నానంటూ జాతీయ పత్రికల విలేకరులకు చెప్పడమే కాదు, ఆ విషయాన్ని ఫోకస్ చేయాలని అభ్యర్థిస్తున్నాడు. ఇలాంటి వ్యూహాన్ని 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేసీఆర్ ప్లే చేశాడు. ఆనాడు తమిళనాడు, ఒరిస్సా, ఢిల్లీ, బెంగాల్, ఉత్తరాఖండ్ సీఎంలను కలిశాడు. అసెంబ్లీ ఎన్నికల వరకు హడావుడి చేసి ఆ తరువాత మౌనంగా ఉన్నాడు. మళ్లీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో జాతీయ రాజకీయాలంటూ ఫోకస్ పెట్టాడు. మోడీని టార్గెట్ చేయడం ద్వారా బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.వాస్తవంగా ఎనిమిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. కేసీఆర్ సర్కార్ మీద ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని సర్వేల ద్వారా ప్రశాంత్ కిషోర్ తేల్చాడని సమాచారం. అందుకే, ఆ వ్యతిరేకతకు విరుగుడుగా మోడీని టార్గెట్ చేయడం ద్వారా బ్యాలెన్స్ చేయాలని పీకే ఇచ్చిన సలహానట. ఆ మేరకు కేసీఆర్ దూకుడుగా వెళుతున్నాడు. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటుకు ఇటీవల ఢిల్లీ కేంద్రంగా పీకే పావులు కదిపాడు. యూపీయే పక్షాలను చీల్చడం ద్వారా కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని ఆలోచించాడు. ఆ మేరకు మమతను ముందుకు కదిపాడు. మహారాష్ట్ర ఎన్సీపీ అధినేత ద్వారా తొలుత ప్రయత్నం మొదలు పెట్టాడు. కాంగ్రెస్ లేకుండా కొత్త కూటమి సాధ్యం కాదని ఆ తరువాత వచ్చిన వాయిస్ ద్వారా అర్థం అయింది. ఇప్పుడు బీజేపీయేతర పక్షాలను కూటగట్టే పనిలో ఉన్నాడు. అందుకోసం ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్న కేసీఆర్ ను పీకే ముందుకు కదిపాడని తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా కేసీఆర్ పావులు కదిపాడో..ఢిల్లీ నేతలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మోసం చేశాడో..అందరూ చూశారు. ఆయన చెప్పిన మాట మీద నిలబడే రకం కాదని హస్తిన నేతల్లోని అభిప్రాయమట. అందుకే, కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు కేసీఆర్ వద్దకు రావడానికి ఇష్టపడడంలేదని తెలుస్తోంది. ఆ కారణంగా కొత్త పార్టీ వ్యూహాన్ని ఆయన అందుకున్నాడని వినికిడి. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే దేశ వ్యాప్తంగా ఉండేలా కొత్త పార్టీ పెట్టాలని యోచించి వెనక్కు తగ్గారు. ఇప్పుడు పది ఎంపీల కంటే కూడాలేని కేసీఆర్ కొత్త పార్టీ, ప్రధాని అభ్యర్థి అనేది ఉత్తమాటే అనుకోవచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు కేసీఆర్ చేస్తోన్న హడావుడి అంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వరకే. బీజేపీకి అనుకూలంగా ఫలితాలు ఉంటే మౌనంగా వెళ్లిపోతాడని ఢిల్లీ స్థాయిలోని చర్చ. సో..మూడోసారి సీఎం కావడానికి తెలంగాణ తరహా అభివృద్ధి మోడల్ , ఫైర్ బ్రాండ్ మమత రాజకీయ ఎత్తుగడలను మేళవించి కేసీఆర్ ప్రదర్శిస్తోన్న దూకుడు ఎంత వరకు ఫలిస్తుందో..చూద్దాం.!