CM KCR: తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. దశాబ్ది ఉత్సవాలు!

అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

  • Written By:
  • Updated On - May 26, 2023 / 11:28 AM IST

CM KCR: పోరాటాలు, త్యాగాలతో, ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జూన్ 2 నుంచి మూడు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. పండుగ వాతావరణంలో జరుపాలని సీఎం అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖర్చుల నిమిత్తం కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు.

గురువారం డా. బిర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో…దేశానికే ఆదర్శంగా తెలంగాణ హరితహారం సాధించిన విజయాలను సీఎం వివరించారు. వాతావరణ పరిస్థితలకు అనుగుణంగా వరి పంట నాట్లను ఇప్పుడు అనుసరిస్తున్న ధోరణిలో కాకుండా ముందస్తుగా సకాలంలో నాటు వేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలగురించి సీఎం వివరించారు. అదే సందర్భంలో… గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ గురించి సీఎం ప్రకటించారు.

దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ ప్రధాన ఉద్దేశ్యంగా.. ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఏర్పడే నాటికి వున్న పరిస్థితులను పదేండ్లకు చేరుకున్న స్వరాష్ట్ర పరిపాలనలో సాధించిన గుణాత్మక అభివృద్ధిని సీఎం రంగాల వారిగా వివరించారు. ఏ రోజు కారోజుగా రోజువారీ కార్యక్రమాలను వివరించిన ముఖ్యమంత్రి ఆయారోజు చేపట్టే శాఖలు అవిసాధించిన అభివృద్ధిని వివరిస్తూ…అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ప్రజాసంక్షేమ కోణాన్ని తాత్విక ధోరణి దాని వెనకున్న దార్శనికతను కలెక్టర్లకు సీఎం అర్థం చేయించారు.

గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు జూన్ 2 నుంచి 22 వరకు ఏరోజున ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం వివరించారు. ఈ మూడు వారాల ఉత్సవాల విశిష్టతను, ప్రాముఖ్యత ప్రాశస్త్యాన్ని వివరించారు.

గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ గురించి సీఎం సమావేశంలో అంశాల వారీగా లోతుగా విశదీకరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు.

పదేండ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానంలో ఆదర్శంగా నిలిచిన ఆయా శాఖలకు సీఎం అభినందనలు తెలిపారు. వ్యవసాయం విద్యుత్తు సాగునీరు ఆర్ అండ్ బీ తదితర శాఖల మంత్రులను అధికారులను సీఎం అభినందించగా సమావేశం చప్పట్లతో హర్షం వ్యక్తం చేసింది.

కాగా సీఎం ఆదేశాలను అనుసరించి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సాధించిన అభివృద్దిని దేశం నలుదిక్కులా కనిపించేలా తెలంగాణ గరిమ ప్రస్పుటించేలా చాటేందుకు, పండుగ వాతావరణంలో దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించేందుకు తాము ఈ మూడు వారాలు కృషిచేస్తామని కలెక్టర్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సీఎంఒ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డిజీపి, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘‘కొన్ని దశాబ్దాల పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అందరం కలిసి సమిష్టి కృషితో అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో సమ్మిళితాభివృద్ధిని సాధించుకున్నాం. నేడు తెలంగాణ వ్యవసాయం ఐటి పరిశ్రమలు విద్యుత్ సహా అన్ని రంగాల్లో దేశంలోనే ముందంజలో వున్నది. నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ నాటికి మనకన్నా ముందంజలో వున్న గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు పంజాబ్ హర్యానాలను దాటేసి తెలంగాణ ముందంజలోకి దూసుకుపోతున్నది. రాష్ట్రం వచ్చిన్నాడు కేవలం 8 లక్షల టన్నులుగా వున్న ఎరువుల వినియోగం నేడు 28 లక్షల టన్నులు వాడుతున్నం. వొక పద్ధతి ప్రకారం ఎటువంటి ఇబ్భంది రాకుండా ఎరువలను ఇతర వ్యవసాయ అవసరాలను రైతులకు అందుబాటులోకి తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన దార్శినిక విధానాలతోనే ఇది సాధ్యమైంది. వొకనాడు గంజికేంద్రాలు నడిచిన పాలమూరులో నేడు పచ్చని పంటలతో పారే వాగులతో పాలుగారే పరిస్ఠితి నెలకొన్నది. ధాన్యం ఉత్పత్తిలో మనం పంజాబ్ ను దాటేసి పోతున్నం.’’ అని సీఎం వివరించారు.

ఉద్యమ నాయకత్వమే స్వయంగా పాలన చేస్తే ప్రగతి సాధించడం కష్టం అనే అపోహను పటాపంచలు చేస్తూ ఎటువంటి భావోద్వేగాలకు గురికాకుండా పరిపాలనను నిర్థిష్ట లక్ష్యంతో ముందుకు కొనసాగించడం జరిగిందన్నారు. తత్పలితంగా దేశానికే ఆదర్శవంతమైన పాలనను అందించగలిగామని సీఎం అన్నారు. నేడు విద్యా వైద్య రంగాల్లో తెలంగాణ అత్యద్భుత ఫలితాలను అందుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ విద్యార్థుల నీట్ , ఐఎఎస్ పోటీ పరీక్షల్లో దేశంలోనే ముందువరసలో ర్యాంకులు సాధిస్తూ తెలంగాణ కీర్తిని చాటుతుండడం పట్ల సీఎం హర్షం వక్తం చేశారు. విద్యార్థులను అభినందించారు. కాగా నారాయణ్ పేట్ ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు సివిల్ సర్వీసెస్ లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకును సాధించిన నేపథ్యంలో సమావేశం అభినందనలు తెలిపింది.

వానాకాలం నారు రోహిణీ కార్తెలో.. యాసంగి నారు అనురాథ కార్తెలో..

గత పాలకులు నిర్లక్ష్యానికి కునారిల్లిపోయిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాలనే దృఢ సంకల్పంతోనే వ్యవసాయ రంగ పునరుజ్జీవనమే ప్రథమ ప్రాధామ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని సీఎం అన్నారు. అందులో భాగంగా వ్యవసాయానికి సపోర్టు వ్యవస్థలయిన చెరువులు విద్యుత్తు సాగునీరు తదితర రంగాలను బలోపేతం చేసుకున్నామన్నారు. తత్ఫలితమే నేడు మనం చూస్తున్న దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర అభివృద్ధి’’ అని సిఎం అన్నారు. నేడు తెలంగాణలో ధాన్యం దిగుబడి 3 కోట్ల మెట్రిక్ టన్నులను దాటిపోతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన చర్యలను రైతులను సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్లు చేపట్టాలని సిఎం అన్నారు. ఇటీవలి కాలంలో కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానలు పర్యవసానంగా జరిగిన పంట నష్టం రైతుకు కలిగిన కష్టాలను గుణపాఘంగా తీసుకుని అందుకు అనుగుణంగా పంట విధానాలను మార్చుకోవాల్సిన అవసరమున్నదని సిఎం అన్నారు.

‘‘తాలు తక్కువ..తూకం ఎక్కువ’’

‘‘ప్రాజెక్టులతో సాగు నీరు పుష్కలంగా అందుబాటులో వుంది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వుంది. గ్రౌండ్ వాటర్ వుంది. ఇవాల మొగులు మొకం చూడకుంట కాల్వల నీల్లతోని వరి నాట్లు పెట్టుకునే పరిస్థితి నేడు తుంగతుర్తి సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కూడా వుంది. ఈ నేపథ్యంలో.. మన రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా యాసంగి నాట్లు ఆలస్యం కావడం వలన కోతలు కూడా లేటయితున్నయి. మార్చి 31 లోపే జరగాల్సిన కోతలు మే నెల దాటినా కొనసాగుతున్నయి. దాంతో ఎండాకాలంలో వచ్చే అకాల వర్షాలు వడగండ్ల వానలతో వరి పంటలు నష్టపోతున్న పరిస్థితి తెలెత్తుతుంది. ఈ బాధలు తప్పాలంటే నవంబర్ 15-20 తారీఖుల్లోపల యాసంగి వరినాట్లు వేసుకోవాల్సి వుంటది. మరి యాసంగి ముందుగాల నాట్లు పడాలంటే వానకాలం వరినాటును కూడా ముందుకు జరుపుకోవాల్సి వుంటుంది. అందుకోసం రోహిణీ కార్తె ప్రారంభంలోనే వానాకాలం వరినాట్లు మొదలు కావాలె. మే 25 నుంచి 25 జూన్ వరకు వానాకాలం వరినాట్ల ప్రక్రియ పూర్తి కావాల్సి వుంది. ఈ దిశగా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర రైతాంగాన్ని వ్యవసాయ శాఖ సహకారంతో చైతన్యం చేయాల్సి వుంటుంది.’’ అని సిఎం అన్నారు.

కాగా… యాసంగి లో వరినారు నవంబర్ నెలలో అలికితే తీవ్రమైన చలికి నారు పెరగదనే అపోహ రైతుల్లో వుందని అదివాస్తవం కాదని సిఎం అన్నారు. ‘‘వరి తూకం పోసే టప్పుడు కాదు. వరి ఈనే సమయంలో చలి వుండొద్దు. ఈన్తానప్పడు చలి వుంటే తాలు ఎక్కువయితది. ఎండలు ముదరకముందే వరికోసుకుంటే గింజ గట్టిగవుండి తూకం కూడా బాగుంటది. ఇది రైతు సోదరులు గమనించాలె. వ్యవసాయశాఖ ఈ దిశగా రైతులను చైతన్యపరిచి అకాల వర్షాలతో పండిన పంటలు నష్టపోకుండా, ధాన్యం తడిసే పరిస్థితిలేకుండా.. ముందుగానే నాట్లేసేకుని ముందస్తుగానే నూర్చుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలె..’’ అని సిఎం వివరించారు. యాసంగి వరిని ముందుగా నాటుకుంటే… ‘‘తాలు తక్కువయితది..తూకం ఎక్కువయితది’’ అని సిఎం రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా.. ఈ దిశగా వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యల వివరాలను సిఎం ఆదేశాలమేరకు ఆశాఖ మంత్రి సింగిరెడ్డ నిరంజన్ రెడ్డి సమావేశంలో వివరించారు. 21 రోజుల పాటు జరిగే దశాబ్ధి ఉత్సవాలను జిల్లాల వారీగా వీడియో రికార్డు చేసి బధ్రపరచాలని సిఎం కలెక్టర్లను ఆదేశించారు. అదే సందర్భంలో నియోజకవర్గాల వారీ జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని తెలిపే .. పదేండ్ల ప్రగతి నివేదిక.. పుస్తకాలను ముద్రించి అందచేయాలన్నారు.ఇప్పటికే నిర్ణయించిన మేరకు ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధిని డాక్యుమెంటరీలు రూపొందుతున్నాయని వాటిని ఈ ఉత్సవాల సంధర్భంగా ప్రదర్శించాలని సిఎం ఆదేశించారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు

జూన్ 24 నుంచి 30 తారీఖు వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ: రాష్ట్రవ్యాప్తంగా…2845 గ్రామాలు తాండాలు గూడాల పరిథిలో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో వున్న4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందచేయాలని సిఎం ప్రకటించారు. తద్వారా1,50,224మంది గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని సిఎం స్పష్టం చేశారు. పోడుభూముల పట్టాలు అందించిన వెంటనే ప్రతి లబ్ధిదారుని పేరుతో ప్రభుత్వమే ఐఎఫ్ఎస్ కోడ్ తో కూడిన బ్యాంకు ఖాతాను తెరిపించాలని ఈ బాధ్యత గిరిజన సంక్షేమ శాఖ, కలెక్టర్లదేనని సిఎం స్పష్టం చేశారు. ఈ ఖాతాల ద్వారా లబ్ధిదారులకు రైతుబంధును ప్రభుత్వం అందచేస్తుందని సిఎం తెలిపారు. వీరితో పాటు 3 లక్షల 8 వేల మంది ఆరో వో ఎఫ్ ఆర్ పట్టాదారులకు కూడా రైతుబంధును వర్తింపచేస్తామని సిఎం అన్నారు.

బీసీ ఎంబీసీ కులాలకు ఆర్థిక సాయం

బీసీ కుల వృత్తులను కాపాడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సిఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో కులవృత్తుల మీద జీవనం కొనసాగిస్తున్న విశ్వకర్మలు తదితర బీసీ ఎంబీసీ కులాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్షరూపాయల ఉచిత ఆర్థిక సాయాన్ని అందిస్తుందని సిఎం ప్రకటించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతను ఏర్పడిన సబ్ కమిటీ సమావేశమై ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలన్నారు. జూన్ 9 నాడు జరుపుకునే తెలంగాణ సంక్షేమ సంబురాల్లో… సబ్ కమిటీ సిఫారసు చేసిన ఇప్పటికీ ఆదుకోని బీసీ ఎంబీసీ కులాలకు లక్షరూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

గృహలక్ష్మి పథకం

నియోజకవర్గానికి 3 వేల చొప్పున అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలని సిఎం ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం కొనసాగుతుందని సిఎం స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆయా దశలను ఫోటోలు తదితర మార్గాల ద్వారా నిర్ధారించుకుని, నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు దశలవారీగా గృహలక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలన్నారు.

సొంతజాగాలున్న లబ్ధిదారులకు మొదటి దశ అనగా బేస్ మెంట్ దశలో 1 లక్ష రూపాయలు, స్లాబ్ దశలో మరో లక్ష రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన ఆఖరి దశలో మరో లక్షరూపాయలు మొత్తంగా మూడు లక్షల రూపాయలు అందచేయాలని సిఎం తెలిపారు.

ఇందుకు సంబంధించిన నిర్థిష్ట విధి విధానాలను రూపొందించి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించాలని సిఎస్ శాంతి కుమారిని సిఎం కేసీఆర్ ఆదేశించారు.

ప్రతీ నియోజకవర్గానికి 1100 వందల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి క్రమపద్దతిలో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని సిఎం తెలిపారు.

గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించి దశలవారీగా అమలు చేయాలని సిఎం తెలిపారు.

‘‘సఫాయన్నా నీకు సలామన్నా’’

సఫాయీ కార్మికులు భగవంతునంతటివారు: సిఎం శ్రీ కేసీఆర్
గ్రామ పట్టణ స్థాయిల్లో పారిశుధ్యకార్మికుల సేవలు వెలకట్టలేనివని వారిని దశాబ్ధి వేడుకల సందర్భంగా…సఫాయన్న నీకు సలామన్నా…అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ సంధర్బంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ… ‘‘మనుషులు పరిసరాలు పరిశుభ్రంగా వుంచుతూ తోటి మానవుల కోసం వారి జీవితాలను త్యాగం చేస్తున్న పారిశుద్య కార్మికులు భగవంతుని అంతటి వారు. వారు చేస్తున్న పనికి మనం ఏమాత్రం వెలకట్టలేం. వారికి ప్రభుత్వం సాయం చేయడమంటే పరోక్షంగా సమాజానికి సాయం చేయడం వంటిదే. సఫాయి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నది. వారు ఎటువంటి డిమాండు చేయకున్నా జీతాలు పెంచుతున్న కారణం వారిమీద గౌరవంతోనే..’’ నని సిఎం స్పష్టం చేశారు.

పారిశుద్య కార్మికులు లేని సమాజాన్ని ఊహించుకోవడం కూడా కష్టమేనని సిఎం అన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఉదాహరణలు చెప్పి సభలో ఆలోచనతో పాటు సిఎం నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ….‘‘ ఉదాహరణకు మనకు క్షవరం చేసే వారు లేరనుకుందాం. అప్పుడు మనుషులు ఎట్లా వుంటారో వూహించుకోండి. నెత్తిపెరిగి గడ్డం పెరిగి గుడ్డేలుగులు లెక్క తిరుగుతుంటారు..’’

అనగానే సభలో నవ్వులు విరియడంతో పాటు… ఈ దేశంలో సేవలు చేసే మనుషుల త్యాగాలు ఎంత గొప్పవో సిఎం ఎరుకపరిచారు. వారిని గౌరవించుకోవడం మనందరి కర్తవ్యమని ఉద్భోదించారు. సేవలు చేసే మనుషులు వుండబట్టే మానవ సమాజం సుఖ సంతోషాలతో జీవిస్తున్నదన్నారు. రోడ్లు పరిసరాలను పరిశుభ్రం చేయకుండా వుంటే ఎంత అధ్వాన్నంగా పరిస్థితులు తయారౌతాయో ఆలోచించడానికి కూడా కష్టమేనన్నారు. ఈదేశ అభివృద్ధిలో రాష్రా రభివృద్ధిలో సఫాయన్నలు అక్కల పాత్ర చాలా గొప్పదని సిఎం అన్నారు. దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో ఉత్తమ సఫాయీ కార్మికులను గుర్తించి…మహిళా పురుష కార్మికులకు అవార్డులు అందచేస్తామని సిఎం తెలిపారు.

జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు మూడు వారాల పాటు సాగే..‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ రోజు వారీ కార్యక్రమాల పూర్తి వివరాలను గురువారం నాటి సమావేశంలో కలెక్టర్లకు సిఎం వివరించారు. ఈ దిశగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని ఆదేశించారు.

జూన్ 2వ తేదీ- శుక్రవారం – ప్రారంభోత్సవం
• గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు.
• హైదరాబాద్ లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి గారిచే పతాకావిష్కరణ
• ముఖ్యమంత్రి గారిచే దశాబ్ది ఉత్సవ సందేశం
• జిల్లాల్లో మంత్రివర్యులఆధ్వర్యంలో పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశం.

జూన్ 3వ తేదీ – శనివారం – తెలంగాణ రైతు దినోత్సవం
• రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతుల సమావేశం. సమావేశం జాతీయగీతాలపనతో ప్రారంభం కావాలి.
• రైతు వేదికలను మామిడి తోరణాలు, పువ్వులు, సీరియల్ బల్బులతో అద్భుతంగా అలంకరించాలి.
• రైతు వేదికల ప్రాంగణాల్లోనూ, హాలు లోపల కూడా రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై ఫ్లెక్సీలు/పోస్టర్లు పెట్టాలి.
• ఉచిత కరంటు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే విధంగా ఫ్లెక్సీలు ఉండాలి.

• సభలో రైతుబంధు సమితుల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు,PACS చైర్మన్లు, వ్యవసాయ, హార్టికల్చర్, మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు, నాయకులుఅందరూ పాల్గొనాలి.
• పాంప్లెట్ లో వ్యవసాయరంగంలో జరిగిన సంపూర్ణ ప్రగతిని వివిధ పథకాల (ఉచిత విద్యుత్తు, రైతుబంధు మొదలైన వాటికింద) ఒక్కో రైతుకు కలిగిన లబ్దిని వివరించాలి. ఆ క్లస్టర్ లోని గ్రామాలకు వ్యవసాయశాఖ ద్వారా వచ్చిన నిధుల గురించి వివరించాలి. పాంప్లెట్లు సభలో ఆవిష్కరించాలి. పంచాలి. సభలో చదవాలి.
• రాష్ట్ర వ్యవసాయ శాఖ కరపత్రం,బుక్ లెట్, పోస్టర్ల వంటి సమాచార సామగ్రిని తయారు చేసి, కలెక్టర్లకు పంపిస్తుంది. వీటిని ప్రతి రైతుకు అందేలా పంపిణీ చేయాలి.
• రైతు బీమా లబ్దిదారులతో వారి కుటుంబానికి కలిగిన మేలును గురించి సభలో మాట్లాడించాలి.
• వ్యవసాయ కళాశాలల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.
• రైతులందరితో సామూహిక భోజనం

జూన్ 4వ తేదీ – ఆదివారం – సురక్షా దినోత్సవం (రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి కార్యక్రమాలు)
• రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని, సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా కార్యక్రమాలు.
• పోలీసుశాఖలో జరిగిన సంస్కరణలను, వాటి విశిష్టతను సభల ద్వారా, కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలి.
• పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను సత్వరంగా పూర్తి చేయడంలో తెలంగాణ పోలీస్ గత 8 సంవత్సరాలుగా దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిన విషయాన్ని హైలైట్ చేయాలి.
• ఈ విధంగా పోలీసుశాఖ సాధించిన ఘనతలను, విజయాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను చేపట్టాలి.

హైదరాబాద్ నగర కార్యక్రమం
• హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పై పెట్రోలింగ్ కార్స్, blue colts ర్యాలీ.
• హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వారంతా పాల్గొంటారు.
• సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు -అంబేద్కర్ విగ్రహం ముందు పోలీస్ బ్యాండ్లతో ప్రదర్శన
• Know your Protectors థీమ్ తో ఎగ్జిబిషన్, పలు కార్యక్రమాలు. పోలీస్ జాగృతి కళాకారుల బృందాలతో ప్రదర్శనలు.
• పోలీసులు వాడుతున్న అధునాతన సాంకేతిక అంశాలు, బాడీ కెమెరాలు, బ్రీత్ అనలైజర్లు మొదలైన పరికరాల గురించి వివరిస్తారు.
• పోలీస్ జాగిలాలు వివిధ నైపుణ్యాల గురించి ప్రదర్శన
• మహిళా భద్రత – మహిళలకు 33శాతం రిజర్వేషన్ – పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విశిష్ట సేవలు – సీసీ కెమెరాలతో పటిష్ట నిఘాలో నెంబర్ 1గా తెలంగాణ తదితర విషయాలను షో కేస్ చేస్తారు.

జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు
• పెట్రోలింగ్ కార్స్, Blue colts, ఫైర్ వెహికిల్స్ తదితరాలతోర్యాలీ నిర్వహించాలి.
• సాయంత్రం ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బందితో సభ నిర్వహించాలి. అనంతరం బడా ఖాన.

జూన్ 5వ తేదీ – సోమవారం – తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం
• నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి (వెయ్యి మందితో), సమావేశంలో విద్యుత్ రంగంలో సాధించిన గుణాత్మక మార్పును వివరించాలి.
• సాయంత్రం రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం. ఈ సమావేశంలో రాష్ట్రం గత 9 ఏండ్లలో సాధించిన విజయాలపై డాక్యుమెంటరీ ప్రదర్శన, పుస్తకావిష్కరణ, ప్రసంగాలు.
• ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి, సీఎండీ జెన్ కో, ట్రాన్స్ కో, స్పెషల్ సీఎస్ ఎనర్జీ, మొత్తం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర విద్యుత్ వినియోగదారులు పాల్గొంటారు.
• రాష్ట్రంలోని అన్ని సబ్ స్టేషన్లను, ఇతర విద్యుత్ కార్యాలయాలను సీరియల్ బల్బులతో (21 రోజుల పాటు ఉండాలి), పూల తోరణాలతో అద్భుతంగా అలంకరించాలి.
• ప్రతి గ్రామంలో విద్యుత్తు గురించిన ఆకర్షణీయమైన ఫ్లెక్సీ నాడు – నేడు పద్ధతిలో ఏర్పాటు చేయాలి.
• విద్యుత్తు రంగంలో సాధించిన విజయాలను గురించి బుక్ లెట్ తయారు చేసి, విస్తృతంగా పంపిణీ చేయాలి.
• గతంలో కరంటు కోతల దుస్థితి – తెలంగాణ వచ్చిన తర్వాత వెలుగు జిలుగుల రాష్ట్రంగా మారిన విషయంతోపాటు…
• గ్రామంలో ఉన్న మొత్తం కనెక్షన్లు – తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన కొత్త కనెక్షన్లు – ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధుల వివరాలు, రైతులకు జరుగుతున్న మేలు, ఇతర రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు ఇస్తున్న విషయం, దానివల్ల వివిధ వృత్తులు, వ్యాపార వ్యవహారాలు సజావుగా నడవడం, గ్రామీణ జీవితంలో వచ్చిన సౌకర్యం తదితర అంశాలను పొందుపరచాలి.
• సోలార్, హైడల్, థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా పెరిగిన తీరును హైలేట్ చేయాలి.
• విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసిన తీరును, దీనికోసం చేసిన ఖర్చు, తదితర వివరాలను వెల్లడించాలి.
• ఇదేరోజు సింగరేణి సంబురాలు జరపాలి, సింగరేణి సీఎండి నేతృత్వం వహించాలి.
• సింగరేణి గనికార్మికులతో సమావేశాలు – కంపెనీ ఉత్పత్తి, టర్నోవర్ పెరగడం, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బోనస్ ఇవ్వడం, కారుణ్య నియామకాలు, సింగరేణి కార్మికుల కోసం చేపట్టిన ఇతర సంక్షేమ కార్యక్రమాలను హైలైట్ చేయాలి.
• సాంస్కృతిక కార్యక్రమాలు – కార్మికులతో సామూహిక భోజనాలు (సింగరేణి కంపెనీ ఆధ్వర్యంలో ఇవి నిర్వహించాలి)

జూన్ 6వ తేదీ – మంగళవారం – తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
• పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహించాలి.
• ఈ సభలో పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని ప్రకటించాలి. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన, అనుమతులు సులభతరమైన విషయాన్ని ప్రస్తావించాలి.
• రాష్ట్రానికి తరలి వచ్చిన పెట్టుబడుల వెల్లువకు సంబంధించిన వివరాలను, తద్వారా పెరిగిన ఉద్యోగ ఉపాధి అవకాశాల వివరాలు ప్రకటించాలి. పాంప్లెట్లు ప్రచురించి, పంచాలి.
• టి హబ్, వి హబ్ లలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సమావేశం నిర్వహించాలి.
• ఐటీ ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో హైదరాబాద్, బెంగళూరును అదిగమించి దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన తీరును ఆవిష్కరించాలి.

జూన్ 7వ తేదీ – బుధవారం – సాగునీటి దినోత్సవం:
• కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంటరీని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించాలి. ఈ డాక్యుమెంటరీని జిల్లా కలెక్టర్లు అందరికీ పంపిస్తారు. (మంత్రి కేటీఆర్ గారు అమెరికా సదస్సులో ప్రదర్శించినది)
• సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో 1000 మందితో సభ.
• ఈ సభలో రైతులు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొనాలి.
• రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ ఇరిగేషన్ రంగంలో జరిగిన ప్రగతిని వివరించాలి. అత్యధికశాతం నిధులు వెచ్చించి, బృహత్తరమైన ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించిన విషయం వెల్లడించాలి. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల, బహుళార్దకసాధక కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్ల రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనతను ప్రముఖంగా తెలియజేయాలి.
• అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టులు పూర్తి కావస్తున్న విషయాన్ని తెలియజేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో చెక్ డ్యాంల నిర్మించడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగిన విషయం తెలియజేయాలి. కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణలో నేడు దాదాపు 85 లక్షల ఎకరాలకు సాగు నీటి సరఫరా జరుపుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ప్రభుత్వ కృషిని గొప్పగా తెలియజేయాలి.
రాష్ట్రస్థాయి కార్యక్రమం….
• రవీంద్ర భారతిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశంజరుగుతుంది. పుస్తకాల ఆవిష్కరణ, ప్రసంగాలు. తదితర కార్యక్రమాలు ఉంటాయి.
• ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటారు.

జూన్ 8వ తేదీ –గురువారం – ఊరూరాచెరువుల పండుగ:
• గ్రామ పంచాయతీలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సాయంత్రం 5 గంటలకు చెరువుల పండుగ నిర్వహించాలి.
• గ్రామం నుంచి డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్య కారుల వలలతో ఊరేగింపుగా బయలుదేరాలి.
• గ్రామంలోనిరైతులు, మత్స్య కారులు, మహిళలుఅన్ని వర్గాల ప్రజలు చెరువు కట్టకు చేరుకోవాలి.
• చెరువు గట్టుపై పండుగ వాతావరణం ప్రతిఫలించేలా ముగ్గులు, తోరణాలతో అందంగా అలంకరించాలి.
• కట్ట మైసమ్మపూజ – చెరువు నీటికి పూజ చేయాలి.
• తదనంతరం సభ, సాంస్కృతిక కార్యక్రమాలు – బతుకమ్మ, కోలాటాలు – పాటలు, గోరేటి వెంకన్న రాసిన చెరువోయి.. మా ఊరి చెరువు తదితర చెరువు పాటలు వినిపించాలి.
• ఇరిగేషన్ లో వచ్చిన ప్రగతి, తద్వారా పెరిగిన పంటల ఉత్పత్తి వివరాలు, మత్స్య సంపద, భూగర్బ జలాల పెరుగుదల.. తదితర వివరాలను తెలియజేస్తూ, ఫ్లెక్సీలు పెట్టాలి – పాంప్లెట్లు పంచాలి – చదివి వినిపించాలి.
• నాయకులు, ప్రజలు కలిసిచెరువు కట్టమీదసహపంక్తిభోజనాలు చేయాలి.
• ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు, తదితరులు పాల్గొంటారు.

జూన్ 9,శుక్రవారం – తెలంగాణ సంక్షేమ సంబురాలు:
• నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పించన్లు, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులతో వెయ్యి మందికి తగ్గకుండా పాల్గొనేలా సభ నిర్వహించాలి.
• ఆ నియోజకవర్గంలో ఎంత మంది పించన్లు, కల్యాణ లక్ష్మి, తదితర సంక్షేమ పథకాల లబ్ధి పొందారు, ఇందుకోసం ఎన్ని నిధులు వెచ్చించారు, దాని ఫలితాలు గురించి వివరించాలి.
• తాము పొందిన లబ్ధి గురించి, లబ్ధిదారుల చేత మాట్లాడించాలి.
రాష్ట్ర స్థాయి కార్యక్రమం…
• తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ రవీంద్ర భారతిలో ఒక సభ నిర్వహించాలి.
• మొత్తం రాష్ట్రంలో అమలైన అన్ని సంక్షేమ కార్యక్రమాల వివరాలు, లబ్ధిదారుల సంఖ్య, ఇందుకోసం వెచ్చిన నిధులు.. వంటి పూర్తి వివరాలు తమ తమ ప్రసంగాల ద్వారా సభలో ఆవిష్కరించాలి.
• గౌరవ మంత్రి వర్యులు, ఆ శాఖ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు ఇందులో పాల్గొంటారు.
• గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి.
• గతంలో భూములు సేకరించిన చోట, అందుబాటులో ఉన్న చోట అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలి.
• వివిధ గ్రామీణ వృత్తి పనుల వారికి ఆర్థిక ప్రేరణ కింద లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభం.

జూన్ 10వ తేదీ, శనివారం – తెలంగాణ సుపరిపాలన దినోత్సవం – పరిపాలన సంస్కరణలు, ఫలితాలు:
• అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును ప్రముఖంగా ప్రస్తావించాలి.
• ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అందరినీ భాగస్వామ్యం చేయాలి.
• ఆయా జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, రెవిన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు తదితర వివరాలతో కరపత్రం తయారు చేసి పంపిణీ చేయాలి. వీటివల్ల ప్రజలకు దూరభారం తగ్గడమే కాకుండా, పరిపాలన పరమైన పర్యవేక్షణ సులభతరమైన విషయాన్ని పేర్కొనాలి.
• వివిధ శాఖలను పునర్ వ్యవస్థీకరణ చేయడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతున్నవిషయాన్నివివరించాలి.
• ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ, హెల్త్, విద్యుత్తు, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల పునర్ వ్యవస్థీకరించిన తీరుతెన్నులను, తద్వారా పరిపాలన సుగమమై ప్రజలకు చక్కని సేవలు అందుతున్న విధానాన్ని, వీటి ప్రభావంతో ప్రజాజీవితంలో వచ్చిన మెరుగుదలపై నివేదిక తయారు చేయాలి.
• రాష్ట్రస్థాయిలోనూ సమావేశం నిర్వహించి, పై అంశాల గురించి వివరించాలి.
• నూతనంగా ఏర్పడిన మండలాలు, మున్సిపాలిటీల్లో సంబురాలు జరిగేలా స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి.

జూన్ 11వ తేదీ, ఆదివారం – తెలంగాణ సాహిత్య దినోత్సవం – రాష్ట్ర స్థాయిలో, జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు
• రవీంద్రభారతిలో తెలంగాణ గంగాజమునా తెహజీబ్ ప్రతిబింబించేలా ఉర్దూ, తెలుగు కవులచే రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం
• ఈ కార్యక్రమాల్లో తెలంగాణ కవులు, సాహిత్యాభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
• తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా కవితలు ఉండాలి
• రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన 5 పద్య కవితలను, 5 వచన కవితలను ఎంపిక చేసి వాటికి నగదు బహుమతులు ప్రకటించాలి.
• జిల్లాస్థాయి కవి సమ్మేళనంలో చదివిన కవితలతో కవితా సంకలనం ప్రచురించాలి.
• రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో చదివిన కవితలతో కూడా ఒక కవితా సంకలనాన్ని ప్రచురించాలి.

జూన్ 12వ తేదీ – సోమవారం – తెలంగాణ రన్
• తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించాలి.
• ఈ రన్ కార్యక్రమంపోలీసు శాఖ నేతృత్వంలో జరుగుతుంది.
• క్రీడలు, యువజన సర్వీసులశాఖ భాగస్వామ్యాన్ని పంచుకోవాలి.
• ఈ సందర్భంగా ప్రత్యేకంగా బెలూన్స్ ఎగురవేయాలి