CM KCR: డిసెంబర్ 4న మహబూబ్​నగర్​కు సీఎం కేసీఆర్.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ డిసెంబర్ 4న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.

  • Written By:
  • Updated On - November 21, 2022 / 02:42 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ డిసెంబర్ 4న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. నూతనగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అయితే మునుగోడులో తెరాస విజయం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాల్గొంటున్న తొలి బహిరంగ సభ ఇదే కావడంతో సీఎం కెసిఆర్ ఏం మాట్లాడబోతున్నారో అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

డిసెంబర్ 4న జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అంతే కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమాల అనంతరం ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొత్త కలెక్టరేట్, బహిరంగ సభ నిర్వహించే మైదానాన్ని పరిశీలించారు. గతంలో ఇదే మైదానంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సభ నిర్వహించామన్నారు. అక్కడ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అదే రోజున పాత కలెక్టరేట్ స్థానంలో కొత్తగా నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం, మినీ స్టేడియంలో కూడా అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, టీఆర్‌ఎస్ నేతలపై ఈడీ సోదాలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రభావం వంటి అంశాలతో పాటు మునుగోడు తర్వాత తొలి భారీ బహిరంగ సభ కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మునుపటి విజయం.. మరోవైపు ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్‌ మహాసభలో ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉందని.. ఇక నుంచి నేతలంతా ప్రజల్లో ఉండాలని గులాబీ బాస్ సూచించిన నేపథ్యంలో ఈ పర్యటనపై చాలా ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్ ఏం చెబుతారో..? ప్రస్తుత రాజకీయాలపై ఆయన ఎలా స్పందిస్తారోనని తెరాస శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

తాజాగా.. ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేతల వ్యాఖ్యలు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేయడం వంటి అంశాలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ సమస్యలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో అని ప్రజలతో పాటు ఇతర పార్టీల నాయకులు ఎదురుచూస్తున్నారు.