Telangana : తెలంగాణ‌లో నేడు తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించ‌నున్న కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో వైద్య విద్య విప్లవం నడుస్తోందని ఆరోగ్య శాఖ

  • Written By:
  • Updated On - September 15, 2023 / 07:43 AM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో వైద్య విద్య విప్లవం నడుస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వివిధ జిల్లాల్లో తొమ్మిది వైద్య కళాశాలలను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగామ జిల్లాల్లో రాష్ట్ర నిధులతో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్‌ కాలేజీలను సీఎం ప్రారంభించ‌నున్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో కూడిన పరివర్తనాత్మక పాలన పర్యవసానంగా, ఆహారధాన్యాలు, వైద్యులను ఉత్పత్తి చేయడంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి హ‌రీష్ రావు తెలిపారు. విభజనకు ముందు తెలంగాణలోని 10 జిల్లాల్లో ఐదు వైద్య కళాశాలలు ఉన్నాయని.. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హాయాంలో నాలుగు జిల్లాలు ఉన్న రాయ‌ల‌సీమ‌కు నాలుగు మెడిక‌ల్ కాలేజీలు ఇచ్చారు కానీ తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేద‌న్నారు. ఈ రోజు తెలంగాణ‌లో మరో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నామ‌ని ఆయ‌న తెలిపారు. తాము ప్రతి సంవత్సరం 2,850 మంది వైద్యులను తయారు చేస్తున్నామ‌ని..గత సంవత్సరం ఒకేసారి ఎనిమిది వైద్య కళాశాలలను ప్రారంభించిన‌ట్లు మంత్రి హ‌రీష్‌రావు తెలిపారు. కొన్నేళ్లలో వైద్య, వైద్య విద్య రెండింటిలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని హ‌రీష్ రావు తెలిపారు