AP TS Assets : న్యూఢిల్లీ భేటీ రేపే!ఉమ్మ‌డి ఆస్తులపై కేసీఆర్ స్కెచ్!!

ఎన్నిక‌ల వేళ ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయం చేయ‌డం పార్టీలు చేసే ప‌ని. ఆ విష‌యంలో కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు.

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 12:34 PM IST

ఎన్నిక‌ల వేళ ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయం చేయ‌డం పార్టీలు చేసే ప‌ని. ఆ విష‌యంలో కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు. ప్ర‌స్తుతం ఏపీ విభజ‌న చ‌ట్టాన్ని కేంద్రం మెడ‌కు చుట్ట‌డానికి కేసీఆర్ మాస్ట‌ర్ స్కెచ్ వేశారు.మూడోసారి తెలంగాణ సీఎం కావ‌డానికి బీజేపీని టార్గెట్ చేయ‌డం మాత్ర‌మే మార్గ‌మ‌ని ఆయ‌న విశ్వ‌సిస్తున్నారు. ఆ క్ర‌మంలో అటు జ‌గ‌న్ ఇటు మోడీని సెంటిమెంట్ తో కొట్టాల‌ని భావిస్తున్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని 9, 10 షెడ్యూల్ అంశాల‌ను తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు. వాటిని ప‌రిష్క‌రించ‌కుండా ఎన్ని మీటింగ్ లు పెట్టిన‌ప్ప‌టికీ వేస్ట్ అంటున్నారు కేసీఆర్‌.

భౌగోలికంగా విడిపోయిన‌ప్ప‌టికీ అన్న‌ద‌మ్ముల్లా క‌లిసుందామ‌ని ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ ఇచ్చిన మాట‌. కానీ, ఇప్పుడు ఏపీకి అందాల్సిన విద్యుత్ బ‌కాయిలు రూ. 6వేల కోట్లు, తెలంగాన‌లోని ఏపీ ఆస్తుల మీద మెలిక‌పెడుతున్నారు. వాటిపై కోర్టుల్లో ఇప్ప‌టికే ఏపీ స‌ర్కార్ కేసులు వేసింది. ఇప్పుడు ఆ కేసుల‌ను ఉప‌సంహ‌రించుకునేలా కేసీఆర్ ఒత్తిడి తీసుకొస్తున్నారు. తొలి రోజుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేసీఆర్ వెంట‌వెంట‌నే మీటింగ్ లు పెట్టుకున్నారు. తొలి భేటీలోనే ఏపీ స‌చివాల‌య భ‌వ‌నాల‌ను తెలంగాణ‌కు ఇస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంగీక‌రించారు. ఆ త‌రువాత గోదావ‌రిపై ప్రాజెక్టు నిర్మాణం కోసం స‌మావేశ‌మైన సంద‌ర్బంగా కేసీఆర్ చేస్తోన్న ఎత్తుగ‌డ‌ల‌పై ఏపీ ప్ర‌జ‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా నిర‌సించారు. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొంచం దూరంగా కేసీఆర్ కు మెలుగుతున్న‌ట్టు సంకేతాలు ఇచ్చారు.

ఉమ్మ‌డి ఆస్తుల పంప‌కం, వివాదాల‌పై కీల‌క స‌మావేశాన్ని కేంద్ర హోంశాఖ ఈనెల 27న( మంగ‌ళ‌వారం) ఢిల్లీలో నిర్వ‌హిస్తోంది. ఆ స‌మావేశానికి వెళ్ల‌కుండా ఉండేలా ముందుగా కేసీఆర్ మెలిక పెట్టారు. ప్ర‌స్తుతం ఏపీ వేసిన కేసుల‌ను కోర్టుల నుంచి ఉప‌సంహ‌రించుకుంటేనే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని చెబుతున్నారు. ఉన్నతాధికారులతో పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను కేసీఆర్ సమీక్షించారని తెలుస్తోంది . న్యూఢిల్లీలో జరిగే సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

2014 నుంచి 2019 వరకు ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించడంలో సహకరించలేదని, పలుమార్లు చర్చలు జరపాలని టీఎస్‌ సూచించినప్పటికీ కోర్టులను ఆశ్రయించడం ద్వారా వాటిని మరింత జఠిలం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. ఇప్పుడు సీఎంగా ఉన్న జ‌గ‌న్ కూడా “కోర్టు కేసులను ఉపసంహరించుకోవడానికి నిరాకరిస్తోందని కేసీఆర్ చెబుతున్నారు. AP వాటా కోరుతున్న హైదరాబాద్‌లో ఉన్న చట్టంలోని షెడ్యూల్ IX మరియు X కింద జాబితా చేయబడిన ఉమ్మడి సంస్థల ఆస్తులు మరియు అప్పులు, నగదు నిల్వలను సిఎం కేసీఆర్ పరిశీలించినట్లు తెలుస్తోంది.

స‌చివాల‌య భ‌వ‌నాల‌ను ఆయాచితంగా తీసుకున్న త‌ర‌హాలోనే మిగిలిన ఆస్తుల‌ను తీసుకోవాల‌ని కేసీఆర్ మాస్ట‌ర్ స్కెచ్ వేశార‌ట‌. అందుకే , కేంద్రం, ఏపీ ప్ర‌భుత్వాల‌ను ఇరుకున పెట్టేలా కోర్టు కేసుల ఉప‌సంహ‌ర‌ణ లాజిక్‌ను బ‌య‌ట‌కు తీశారు. అంతేకాదు, అనుకూలంగా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద మ‌చ్చ ప‌డ‌కుండా కేంద్రం మీద తుపాకీ పెట్టి పేల్చాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేంద్రం ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో చూద్దాం.