Federal Front : ‘ఫ్రంట్’ ప‌రేషాన్‌.!

ఐదు రాష్ట్రాల ఫ‌లితాల త‌రువాత టీఆర్ఎస్ వ్యూహాత్మ‌క మౌనం వ‌హించింది.

  • Written By:
  • Updated On - March 11, 2022 / 01:18 PM IST

ఐదు రాష్ట్రాల ఫ‌లితాల త‌రువాత టీఆర్ఎస్ వ్యూహాత్మ‌క మౌనం వ‌హించింది. ఎలాంటి కామెంట్స్ ఆ ఫ‌లితాల‌పై చేయ‌డానికి గులాబీ ద‌ళం ముందుకు రావ‌డంలేదు. పైగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు స్వ‌ల్ప అస్వ‌స్థ‌త క‌లిగింది. ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన రామానుజాచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌కు ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ వ‌చ్చిన రోజు కూడా కేసీఆర్ కు స్వ‌ల్ప క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారీ ఎయిమ్స్ లో ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నాడు. ఇటీవ‌ల కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర ఫ్రంట్ కోసం హ‌స్తిన టూర్ సంద‌ర్భంగా కూడా ఎయిమ్స్ లో చెక్ చేయించాడు. ఆ విష‌యాన్ని టీఆర్ఎస్ పార్టీ వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే.ఫెడ‌ల‌ర్ ఫ్రంట్ అంటూ ఇటీవ‌ల కేసీఆర్ చేసిన హడావుడి ఢిల్లీ వ‌ర‌కు చేరింది. అవ‌స‌ర‌మైతే, కొత్త పార్టీ దేశ వ్యాప్తంగా పెడ‌తానంటూ బీరాలు ప‌లికాడు. వామ‌ప‌క్ష జాతీయ నేత‌ల‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్లో కీల‌క సమావేశాన్ని నిర్వ‌హించాడు. త‌మిళ‌నాడు వెళ్లి సీఎం స్టాలిన్ తోనూ భేటీ అయ్యాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుమారుడు తేజ‌స్వి యాద‌వ్ ను హైద‌రాబాద్‌కు పిలిపించుకున్నాడు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తోనూ భేటీ అయ్యాడు. తాజాగా ఢిల్లీ వెళ్లిన ఆయ‌న కేజ్రీవాల్ ను క‌ల‌వాల‌ని ప్ర‌య‌త్నం చేసిన విఫ‌లం అయ్యాడు. అక్క‌డ నుంచి నేరుగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ కు అండ‌గా ప్ర‌చారం చేయ‌డానికి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వెళ్లాడు. అమ‌రులైన జ‌వాన్ల కుటుంబీకుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున ఆర్థిక స‌హాయం అందించాడు.

దేశ స‌రిహ‌ద్దుల్లో ఏం జ‌రుగుతుందో చూసుకోండంటూ ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌ధాని మోడీపై సెటైర్లు వేశాడు. మందికి పుట్టిన పిల్లాడు మావాడే అనే సామెత‌గా రామానాజాచార్యుల విగ్ర‌హాన్ని కూడా బీజేపీ సిగ్గులేకుండా త‌న ఖాతాలో వేసుకుంద‌ని మోడీని టార్గెట్ చేశాడు. విద్యుత్ కు సంబంధించిన అంశాల‌పై ఎన్నిక‌ల్లో చేసిన ప్ర‌సంగాల వీడియోల‌ను మీడియా ముఖంగా ప్ర‌ద‌ర్శించాడు. ప‌చ్చి అబ‌ద్దాలు ఆడుతూ భార‌త ప్ర‌ధాని ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ పట్టిస్తున్నాడ‌ని వ్య‌క్తిగ‌తంగా దూషించాడు. ఆ ప్రెస్మీట్ తో పాటు వీడియోను మ‌హారాష్ట్ర సీఎం థాక‌రే, ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ కు టాగ్ చేశాడు. ఆ కంటెంట్ ను, కేసీఆర్ చేసిన వాగ్దాటిని గ‌మ‌నించిన వాళ్లు శ‌భాష్ అంటూ ప్ర‌శంసించారు. వెంట‌నే మ‌హారాష్ట్ర‌కు వెళ్లిన కేసీఆర్ అక్క‌డి సీఎం థాక‌రే, ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ ను క‌లిశాడు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ తో పాటు మ‌హారాష్ట్ర‌లో ఫ్రంట్ వ్య‌వ‌హారానికి ప‌దును పెట్టాడు. అక్క‌డ వ‌చ్చిన స్పంద‌న గ‌మ‌నించిన కేసీఆర్ వెంట‌నే కేజ్రీని క‌ల‌వ‌డానికి ఢిల్లీకి వెళ్లాడు. ఆ రోజు నుంచి ఆయ‌న ఫ్రంట్ కు బ్రేక్ లు ప‌డ్డాయి. కేజ్రీవాల్ అపాయిట్మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఎయిమ్స్ లో ఆరోగ్య ప‌రీక్ష‌ల‌కు మాత్ర‌మే కేసీఆర్ ఢిల్లీలో ఉన్నాడ‌ని ఆ పార్టీ శ్రేణులు లీకులు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. గ‌త కొన్నేళ్లుగా ప్ర‌కాష్ రాజ్.. ప్ర‌ధాని మోడీని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెంటాడుతున్నాడు. శత్రువుకు శ‌త్రువుగా మిత్రుడు అన్న‌ట్టు ప్ర‌కాష్ రాజ్‌, కేసీఆర్ జ‌త‌క‌ట్ట‌డంతో పాటు జాతీయ స్థాయి ఫ్రంట్ కు సార‌థులుగా ఫోకస్ ఇచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల తరువాత ఫ్రంట్ కు స్వ‌ల్ప విరామం ఏర్ప‌డింది. ఆలోపు కేసీఆర్ కు స్వ‌ల్ప అస్వ‌స్థ‌త ఏర్ప‌డింది. దీంతో వ్యూహాత్మ‌క మౌనం గులాబీ శ్రేణులు వ‌హిస్తున్నాయి. ఈ ప‌రిణామం ఇలాగే కొన‌సాగుతుందా? లేక మ‌ళ్లీ ఫ్రంట్ వాయిస్ ను కేసీఆర్ వినిపించే ధైర్యం చేస్తాడా? అంటే ఆయ‌నతో తెలంగాణ ఉద్య‌మించిన కొంద‌రు ఇక ఫ్రంట్ ఉత్త‌దే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.