Site icon HashtagU Telugu

KCR Vs Modi : ముచ్చింత‌ల్ లో జ్వ‌ర‌ ‘మంట‌’

Kcr Modi Hyd

Kcr Modi Hyd

తెలంగాణ సీఎం కేసీఆర్, ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌వేత్త చిన జీయ‌ర్ స్వామి సాన్నిహిత్యం అంద‌రికీ తెలిసిందే. అందుకే, ముచ్చింత‌ల్ లో ఏర్పాటు చేసిన స‌మ‌తామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌ను శుక్ర‌వారం కేసీఆర్ స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించాడు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చేతుల మీదుగా ఆ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ జ‌రిగే స‌మ‌యంలో ప‌క్క‌నే ఉండాల‌ని కేసీఆర్ భావించాడు. ఒక ముఖ్య‌మంత్రిగా ప్రొటోకాల్ ప్ర‌కారం ప్ర‌ధాని మోడీని ఆహ్వానిస్తాన‌ని కూడా రెండు రోజులు క్రితం మీడియాముఖంగా చెప్పాడు. కానీ, మోడీ ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉండాల్సి వ‌స్తుంద‌ని ముందుగానే త‌న శ‌రీరంలోని మార్పులు చెప్పిన‌ట్టు ఉన్నాయి. ముందురోజే(శుక్ర‌వారం) ప్ర‌ధాని మోడీ కార్య‌క్ర‌మ ప‌ర్య‌వేక్ష‌ణ‌ను మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కు అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. ఏడేళ్లుగా ప్ర‌ధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్ద‌రూ ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో పలు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ప్ర‌ధాని తెలంగాణ వ‌చ్చిన ప్ర‌తిసారి ప్రొటోకాల్ ప్ర‌కారం ఎదురేగి కేసీఆర్ ఆహ్వానించిన సంద‌ర్భాల‌ను చూశాం. పార్ల‌మెంట్ వేదిక‌గా ఏడేళ్లుగా ఎన్టీయే ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అనేక బిల్లులకు టీఆర్ఎస్ పార్టీ ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా స‌హ‌కారం అందించింది. ఆర్డిక‌ల్ 370 ర‌ద్దు, సీఏఏ, వ్య‌వ‌సాయ బిల్లు త‌దితర వివాద‌స్ప‌ద అంశాల‌కు ప‌రోక్షంగా మోడీ స‌ర్కార్ కు టీఆర్ఎస్ స‌హ‌కారం అందించింది. రాష్ట్ర‌ప‌తి, ఉప ఉపరాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌తో పాటు ప‌లు బిల్లుకు ప్ర‌త్య‌క్షంగా మ‌ద్ధ‌తు తెలిపింది. భాగ‌స్వామ్య పార్టీలు కాక‌పోయిన‌ప్ప‌టికీ స‌హ‌జ మిత్రులుగా కొన‌సాగారు. ప‌లు సంద‌ర్భాల్లో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌ధాని మోడీ ఆకాశానికి ఎత్తేశాడు. ప్ర‌తిగా మోడీ ప్ర‌భుత్వాన్ని ప‌లుమార్లు కేసీఆర్ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు.

ఆ రెండు పార్టీల స‌హ‌జ మిత్ర‌త్వంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ప్ర‌చారం చేసింది. ఒక వైపు ఎంఐఎం ఇంకో వైపు బీజేపీల‌తో కేసీఆర్ స‌హ‌జ మిత్ర‌త్వాన్ని కొన‌సాగించాడు. రాజ‌కీయంగా ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికి ఆయ‌న వేసిన ఎత్తుగ‌డ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఫ‌లించాయి. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ప్ర‌ధాని మోడీ మీద ఇటీవ‌ల వ్య‌క్తిగ‌త దాడికి కేసీఆర్ దిగాడు. డ్ర‌స్ లు మార్చినంత ఈజీగా ప‌రిపాల‌న ఉండ‌దంటూ మోడీని ఎత్తిపొడిచాడు. మెద‌డు లేకుండా ప‌రిపాల‌న సాగిస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడానికి వీల్లేద‌ని ఉద్య‌మానికి పిలుపునిచ్చాడు. అందుకు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను కూడా త‌యారు చేశాడు. కొత్త రాజ్యాంగం అవ‌స‌ర‌మంటూ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. చైనా, ఇండియా స‌రిహ‌ద్దుల్లో ఏమి జ‌రుగుతుందో చూస్కోండంటూ ఇటీవ‌ల మోడీకి చుర‌క‌లు వేశాడు. రాజ‌రిక పాల‌న న‌డ‌వ‌ద‌ని హెచ్చ‌రించాడు. యూనియ‌న్ ఆఫ్ ఇండియాను కాద‌ని ప‌రిపాల‌న సాగిస్తున్నాడ‌ని మోడీ మీద విరుచుప‌డ్డాడు. ఏడేళ్ల కాలంలో ఎప్పుడూ ఇంత‌గా కేసీఆర్ కేంద్రంపైగానీ, మోడీ మీద మాట్లాడిన దాఖ‌లాలు లేవు.తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కూడా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై దూకుడుగా వెళుతోంది. హుజురాబాద్ ఫ‌లితాల త‌రువాత నువ్వా? నేనా? అనే విధంగా బీజేపీ,టీఆర్ఎస్ రాజ‌కీయాన్ని వేడెక్కించాయి. వ‌రి ధాన్యం కొనుగోలు అంశంపైన పార్ల‌మెంట్ లోప‌ల‌, బ‌య‌ట ప‌ర‌స్ప‌రం దుమ్మెత్తి పోసుకున్నాయి. ఆ త‌రువాత 317 జివో విష‌యంలో కేసీఆర్ స‌ర్కార్‌ను బీజేపీ బ‌ద్నాం చేసింది. ఆ సంద‌ర్భంగా ఎంపీ బండి సంజ‌య్ జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. దీంతో ఢిల్లీకి చెందిన బీజేపీ. సీనియ‌ర్లు తెలంగాణ‌కు వ‌చ్చారు. కేసీఆర్ స‌ర్కార్ మీద దుమ్మెత్తి పోశారు. త్వ‌ర‌లోనే కేసీఆర్ ను జైలుకు పంపుతామ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌తిగా కేసీఆర్ కూడా ఢిల్లీ బీజేపీ అధిష్టానంపై తిర‌గ‌బ‌డ్డాడు. నేరుగా మోడీని టార్గెట్ చేశాడు. ఒక్క‌సారిగా ఏడేళ్ల స‌హ‌జ మిత్ర‌త్వం రాజ‌కీయ శ‌త్రుత్వంగా రూపాంతరం చెందింది. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక వేదిక‌పైకి వ‌స్తే..చూడాల‌ని చాలా మంది ఎదురుచూశారు. క్షిప‌ణుల్లాంటి విమ‌ర్శ‌నాస్త్రాల‌ను మోడీపై సంధించిన కేసీఆర్ ఏ విధంగా ఆయ‌న్ను రిసీవ్ చేసుకుంటాడోన‌ని ఆస‌క్తిగా చూశారు. ముందుకు ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం శ‌నివారం మోడీ హైద‌రాబాద్ వ‌చ్చాడు. ఎయిర్ పోర్టులో ఆయ‌న్ను ఆహ్వానించిన వాళ్లలో కేసీఆర్ క‌నిపించ‌లేదు. ఇక్రిశాట్ లో జ‌రిగిన కొత్త లోగో ఆవిష్క‌ర‌ణ స‌భ‌లోనూ లేడు. స్వ‌ల్ప జ్వ‌రంతో మోడీ కార్య‌క్ర‌మాల‌కు కేసీఆర్ దూరంగా ఉన్నాడ‌ని అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

ఇటీవ‌ల కేసీఆర్ స్కిప్ చేసిన మోడీ ప‌ర్య‌ట‌న‌లో ఇది రెండోది. కోవిడ్ సంద‌ర్భంగా భార‌త్ బ‌యోటెక్ తో పాటు వ్యాక్సిన్ రీసెర్చ్ కేంద్రాల‌ను ప‌రిశీలించడానికి వ‌చ్చిన‌ప్పుడు కూడా కేసీఆర్ వెళ్ల‌లేదు. అప్పుడు కూడా అస్వ‌స్థత కార‌ణంగా ఆహ్వానానికి వెళ్ల‌లేక‌పోయాడు. ఆ మ‌ధ్య ఢిల్లీ వెళ్లి నెల రోజుల పాటు అక్క‌డే కేసీఆర్ మ‌కాం వేశాడు. ఆ త‌రువాత వారం రోజులు హ‌స్త‌న లోనే ఉన్నాడు. మ‌రోసారి మూడు రోజుల పాటు ఢిల్లీ వెళ్లి వివిధ కేంద్ర మంత్రుల‌ను క‌లిశాడు. కానీ, నెల రోజులు, వారం షెడ్యూల్ స‌మ‌యంలో ఢిల్లీలో కేసీఆర్ వివ‌రాలు మాత్రం స్ప‌ష్టంగా వెల్ల‌డికాలేదు. మూడోసారి మూడురోజుల షెడ్యూల్ గురించి మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి బీజేపీ మీద దూకుడును పెంచాడు. ఆ క్ర‌మంలో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య రాజ‌కీయ వేడెక్కిన స‌మ‌యంలో మోడీ టూర్ కు కేసీఆర్ దూరంగా ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదే రాజ‌కీయ టెంపోను కొన‌సాగించాల‌ని కేసీఆర్ భావిస్తున్నాడు. సేమ్ టూ సేమ్ బెంగాల్ సీఎం మ‌మ‌త ఏ విధంగా మోడీని టార్గెట్ చేసి మూడోసారి సీఎం అయిందో..అదే విధంగా మూడోసారి సీఎం కావాల‌ని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. ప్రస్తుతం మోడీ పాల‌న మీద దేశ వ్యాప్తంగా వ్య‌తిరేకత ఉంద‌ని గులాబీ స‌ర్వేల సారాంశం. మోడీ పాల‌న మీద ఉద్య‌మాలు చేస్తే, రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త సైడ్ అవుతుంద‌ని వ్యూహం ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోది. ఆ క్ర‌మంలో మోడీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని కారు బ్యాచ్ భావిస్తుంద‌ట‌. హుజురాబాద్ ఎన్నిక‌ల త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల‌న్నీ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల‌ను శ‌త్రువులుగా ప్ర‌జ‌లు గుర్తించే ప‌రిస్థితికి తీసుకెళ్లాయి. ఈ స‌మ‌యంలో మోడీ కి సాద‌ర ఆహ్వానం ప‌లుకుతూ ఒకే వేదిక‌ను పంచుకుంటే రాజ‌కీయ సీరియ‌స్ పోతుంద‌ని టీఆర్ఎస్ అంచ‌నా వేస్తుంద‌ని వినికిడి. అందుకే వ్యూహాత్మంగా స్వ‌ల్ప జ్వ‌రంతో కేసీఆర్ స్కిప్ అయ్యాడ‌ని విప‌క్షాల విమ‌ర్శ‌.

సెంటిమెంట్ ల‌కు కూడా కేసీఆర్ ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తాడు. ప్ర‌స్తుతం శ్రీ రామానుజాచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ముచ్చింత‌ల్ లో ప‌లు యాగాలు చేస్తున్నారు. వారం రోజులుగా జ‌రుగుతోన్న ఆ మ‌హా యాగాలు, రుద్రాల‌కు మోడీ కేంద్ర బిందువుగా ఉంటాడు. ఆయ‌న చేతుల మీదుగా పూర్ణాహుతితో పాటు ప్ర‌ధాన కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. దాని ఫ‌లితాలు మోడీకి చెందుతాయ‌ని సెంటిమెంట్ వినిపిస్తోంది. ఆ యాగ ఫ‌లం మోడీకి వ‌స్తే, ఒక వేళ ఆ కార్య‌క్ర‌మానికి వెళితే కేసీఆర్‌కు ఎలాంటి ఫ‌లం వ‌స్తుందో..అనే సెంటిమెంట్ ను కూడా గులాబీ శ్రేణులు వినిపిస్తున్నారు. చాలా మందికి తెలియ‌ని సెంటిమెంట్ల‌ను కేసీఆర్ ఫాలో అవుతుంటార‌ని ఆయ‌న గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పుకుంటున్నారు.అప్ప‌ట్లో కేసీఆర్ ఫాం హౌస్ లో జ‌రిగిన ఆయుత చండీ మ‌హాయాగం సంద‌ర్భంగా జ‌రిగిన సంఘ‌ట‌న ఒక‌సారి అవ‌లోక‌నం చేసుకుంటే..2015లో అది జ‌రిగింది. ముగింపు సంద‌ర్భంగా ఆనాడు రాష్ట్ర‌ప‌తిగా ఉన్న ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని ఆహ్వానించాడు. ఆ స‌మ‌యంలో ముఖ‌ర్జీ స‌తీమ‌ణి మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న‌కు హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం అంటు ఉంటుంది. ఆహ్వానించిన త‌రువాత కాద‌న‌లేని పరిస్థితుల్లో ముఖ‌ర్జీ య‌జ్ఞ‌శాల‌కు రాకుండా వెళ్లేలా అగ్ని ప్ర‌మాదాన్ని సృష్టించార‌ని కాంగ్రెస్ లీడ‌ర్లు కొంద‌రు ఆనాడు అనుమానించారు. అలాంటి సెంటిమెంట్ ఏదో ఇప్పుడు మోడీ విష‌యంలో కూడా కేసీఆర్ పెట్టుకుని ఉంటాడ‌ని విప‌క్ష లీడ‌ర్లు కొంద‌రు ఆరా తీస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో మోదీకి గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చీఫ్ సెక్రటరీ, డీజీపీలు స్వాగతం మోడీకి స్వాగ‌తం ప‌లికారు. స్వల్ప జ్వర లక్షణాలతో కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పర్యటనలో ఆయన రెండు కార్యక్రమాల్లో పొల్గొన్నారు. ఇక్రిశాట్ 50 ఏళ్ల ఉత్సవాలకు ఆయన హాజరు అయ్యాడు. సాయంత్రం 5 గంటలకు సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ మొత్తం కార్య‌క్ర‌మానికి తెలంగాణ సీఎం దూరంగా ఉండ‌డం వెనుక నిజంగా స్వ‌ల్ప జ్వ‌ర‌మా? ఏదైనా సెంటిమెంట్ ఉందా? రాజ‌కీయ వ్యూహమా? అనేది దానిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది.