No To NitiAayog: ఢిల్లీతో ఢీ… నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తూ కెసిఆర్ నిర్ణయం

గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - August 6, 2022 / 11:36 PM IST

గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహిరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇంకా పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఅర్ మోడీ సర్కారు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్లానింగ్ కమిషన్ తీసివేసి తీసుకొచ్చిన నీతి ఆయోగ్ తో ఏం సాధించారని ప్రశ్నించారు.
నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు నిధులు ఇవ్వనప్పుడు… ఆ సంస్థ ఎందుకని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ అనేది నిరర్థకంగా మారిందని దుయ్యబట్టారు. 8 ఏళ్ల కాలంలో నీతి ఆయోగ్ తో ఏం పురోగతి సాధించారని నిలదీశారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఏ హామీ నేరవేరలేదని విమర్శించారు. కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపే అంశంపై చర్చ జరగటం లేదన్నారు. అసలు నీతి ఆయోగ్ అజెండా ఎవరు తయారు చేస్తున్నారనేది కూడా తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. సమాఖ్య స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పని చేస్తోందని చెప్పారు.
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రైతులు 13 నెలల పాటు పోరాటం చేశారని గుర్తుచేశారు. రైతులు పోరాటం చేయకముందే.. 13 రోజుల్లో చట్టాలను రద్దు చేసి ఉండొచ్చు కదా అని కామెంట్ చేశారు. దేశంలో ద్వేషం, అసహనం పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందని విమర్శించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పాతాళానికి పడిపోయిందన్నారు. నీతి ఆయోగ్ సిఫారసులను కూడా కేంద్రం గౌరవం ఇవ్వట్లేదని విమర్శించారు. నీతి ఆయోగ్‌కు ప్రధాని వద్ద గౌరవం సున్నా అని విమర్శించారు. నీతి ఆయోగ్ వల్ల దేశానికి ఏం ఉపయోగం జరిగిందని ప్రయశ్నించారు. ఉపాధిహామీ కూలీలు దేశ రాజధానిలో ధర్నా చేసే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ విధానాల వల్ల అంతర్జాతీయ భారత దేశం పరుపుపోతుందని అన్నారు. నీతి ఆయోగ్ రూపకల్పనలో ఎవ్వరి ప్రమేయం ఉండదని అన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన 14 లక్షల కోట్లు నిధులు ఎగ్గొట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బతిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని శాఖలను నీతి ఆయోగ్ ప్రశంసించిందని చెప్పారు. కేంద్రం నుంచి ప్రశంసలే తప్ప.. నిధులు రాలేదని చెప్పారు.