Telangana: అర్చకులకు సీఎం కేసీఆర్ తీపి కబురు.. గౌరవభృతి పెంపు

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అర్చకులకు తీపి కబురు అందించారు. వేద‌శాస్త్ర పండితుల‌కు తెలంగాణ ప్రభుత్వం నెల నెల గౌర‌వ‌భ‌వృతి 2,500 అందిస్తున్న విషయం తెలిసిందే.

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అర్చకులకు తీపి కబురు అందించారు. వేద‌శాస్త్ర పండితుల‌కు తెలంగాణ ప్రభుత్వం నెల నెల గౌరవభృతి 2,500 అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు సీఎం కెసిఆర్ ఆ గౌరవభృతిని రూ.2,500 నుంచి రూ.5 వేల‌కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గోప‌న్‌ప‌ల్లిలో నిర్మించిన విప్ర‌హిత బ్రాహ్మ‌ణ సంక్షేమ‌ భవనాన్ని సీఎం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెసిఆర్ అర్చకులకు వరాల జల్లు కురిపించారు.

సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వం బ్రహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ప్ర‌స్తుతం బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్ ద్వారా వేద‌శాస్త్ర పండితుల‌కు ఇస్తున్న గౌర‌వభృతిని డబుల్ చేస్తూ ఐదువేల రూపాయలకు పెంచుతున్నట్లు చెప్పారు. అయితే దీనికి అర్హ‌త వ‌య‌సును 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. అదేవిధంగా వేద పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ కోసం ఇస్తున్న 2 ల‌క్ష‌లను ఇక నుండి యాన్యువ‌ల్ గ్రాంట్‌గా ఇస్తామ‌ని చెప్పారు సీఎం కెసిఆర్. ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌ల్లో చదువుకునే బ్రాహ్మ‌ణ విద్యార్థుల‌కు ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ అందిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 3,645 దేవాల‌యాల‌కు ధూప‌దీప నైవేద్య ప‌థ‌కం వర్తిస్తుంది. అయితే మరో 2,796 దేవాల‌యాల‌కు కూడా ఈ పథకాన్ని అందిస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో 6,441 దేవాయాలకు ధూప‌దీప నైవేద్యం కింద నిర్వ‌హ‌ణ వ్య‌యం అందుతుందన్నారు. ధూపదీప నైవేద్యం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు రూ.6 వేలు ఇస్తున్నామని, దీనిని రూ.10వేలకు పెంచుతున్నట్లు చెప్పారు.

శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గోప‌న్‌ప‌ల్లిలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనాన్ని పీఠాధిపతులు, వేద పండితులతో కలిసి సీఎం ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.

Read More: Mid term poll :`ముంద‌స్తు`దిశ‌గా జ‌గ‌న్ రాజ‌కీయ రివ్యూలు