CM KCR: చీఫ్ జస్టీస్ వల్లే హైకోర్టు జడ్జిల సంఖ్య పెరిగింది!

"తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైకోర్టు విడిపోయాక.. బెంచీలు, జడ్జిల సంఖ్యను పెంచాలంటూ

  • Written By:
  • Updated On - April 15, 2022 / 03:51 PM IST

“తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైకోర్టు విడిపోయాక.. బెంచీలు, జడ్జిల సంఖ్యను పెంచాలంటూ ప్రధాని మోదీకి తాను లేఖలు రాసినా.. అవెప్పుడూ పెండింగులోనే ఉండేవి” అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించాకే ఆ సమస్యకు పరిష్కారం లభించిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ పై ఆయనకున్న ప్రేమతో ప్రధాని మోదీతో మాట్లాడి.. తెలంగాణ హైకోర్టు జడ్జిల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచారని గుర్తు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కలిసి కేసీఆర్ ప్రారంభించారు.

ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టు లోని 42 మంది న్యాయమూర్తులకు ఒకేచోట క్వార్టర్స్ కట్టేందుకు దుర్గం చెరువు ప్రాంతంలో 30 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశామని ప్రకటించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర లభించగానే .. నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని సీజేఐ రమణకు విజ్ఞప్తి చేశారు. పెరిగిన జడ్జిల సంఖ్యకు అనుగుణంగా వందలాది అదనపు పోస్టులను హైకోర్టు కు మంజూరు చేశామన్నారు. తెలంగాణ లోని 10 జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కోసం 33కు పెంచిన నేపథ్యంలో.. కొత్త కోర్టుల ఏర్పాటు కు 1730 పోస్టులను మంజూరు చేసినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ను బలోపేతం చేసేందుకు.. దాని పరిధిలో పలు విభాగాలకు 4,348 పోస్టులను మంజూరు చేశామని చెప్పారు. త్వరితగతిన న్యాయ వివాదాలకు పరిష్కారం లభించే చోట్లలోనే విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని.. త్వరితగతిన కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని హైకోర్టు న్యాయమూర్తులను కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పెండింగ్ కేసులు ఎక్కువ, కోర్టులు తక్కువగా ఉన్నాయని.. వీటి పరిధిలో కొత్త కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్రశర్మ కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.