CM KCR: ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల‌కు.. సీఎం కేసీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్..!

  • Written By:
  • Updated On - March 16, 2022 / 12:59 PM IST

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి కేంద్ర ప్రభుత్వం పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. యూపీఏ పాల‌న‌తో పోలిస్తే, ఎన్డీఏ పాల‌న‌లో దేశ ఆర్ధిక పురోగ‌తితో పాటు ప‌నితీరు క్షీణించిద‌ని కేసీఆర్ ఆరోపించారు. యూపీఏ వాళ్ల పనితీరు బాగాలేదని, ఎన్డీఏ వాళ్ళ‌కు అధికారంలోకి తెస్తే మొత్తం దేశమంతా నాశనం అయిపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్న వస్ర్తాలకు పోతే ఉన్న వస్త్రం పోయిందన్నట్టు తయారైంద‌ని, యూపీఏ హ‌యంలో దేశ వృద్ధి రేటు 8% ఉంటే, ఎన్డీఏ హయాంలో ఈ రోజు 6%కి పడిపోయింద‌ని కేసీఆర్ తెలిపారు.

ఇక ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో డబుల్ ఇంజ‌న్ గ్రోత్ అంటూ బీజేపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల పై స్పందించిన కేసీఆర్, దేశంలో అభివృద్ధి విష‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కంటే తెలంగాణ మెరుగైన స్థానంలో ఉంద‌ని కేసీఆర్ అన్నారు. డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ అంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ సర్కారు ఉండటం.. అయితే సింగిల్‌ ఇంజిన్‌ గల తెలంగాణలో తలసారి ఆదాయం 2.78 లక్షలు ఉంటే, డబుల్‌ ఇంజిన్‌ ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 71 వేలు మాత్రమే ఉంద‌ని కేసీఆర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ ఆర్థిక వృద్ధిరేటు 7.26 శాతంగా ఉంటే, తెలంగాణ వృద్ధిరేటు 10.80 శాతంగా ఉంద‌ని, అది డ‌బుల్ ఇంజ‌న్ కాద‌ని ట్ర‌బుల్ ఇంజ‌న్ అని కేసీఈర్ ఎద్దేవా చేశారు.

2017-21 మధ్య కాలంలో డ‌బుల్ ఇంజ‌న్ ఉన్న ఉత్త‌ర ప్రదేశ్‌లో వృద్ధి రేటు 25.69 శాతంగా ఉంటే, అదే కాలంటా సింగిల్‌ ఇంజిన్‌ గల తెలంగాణలో వృద్ధి రేటు 55.46 శాతంగా ఉంద‌ని, తెలంగాగా అభివృద్ధి రేటుతో పోలిస్తే యూపీ అభివృద్ధి రేటు సగం కూడా లేదని, సింగిల్ ఇంజ‌న్ ఉన్న రాష్ట్రంలో రూపాయి సంపాదిస్తే, డబుల్‌ ఇంజిన్‌ ఉన్న రాష్ట్రంలో ఆఠాణా సంపాదించారని కేసీఆర్ సెటైర్స్ వేశారు. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప్రసూతి మరణాల రేటు 167, తెలంగాణలో అది 56 మాత్ర‌మే. అలాగే యూపీలో శిశు మరణాల రేటు 41 ఉండ‌గా, తెలంగాణలో 23గా ఉంద‌ని కేసీఆర్ తెలిపారు. ఇవన్నీ డబుల్‌ ఇంజిన్ అని డప్పుకొట్టే వాళ్ల ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇక ఉక్రెయిన్ నుండి తెలంగాణకు తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల, చ‌దువు ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కేసీఆర్ తెలిపారు. విద్యార్ధుల చదువులు మ‌ధ్య‌లోనే డిస్‌కంటిన్యూ కాకుండా, వారి భవిష్యత్‌ దెబ్బతినకుండా ఉండేలా చూస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేసీఆర్ కోరారు. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన 740 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తుందని అసెంబ్లీలో తెలిపారు. భారత్‌లో ఎంబీబీఎస్ చదవాలంటే కోటి రూపాయలకు పైగా ఖర్చవుతుందని, ఉక్రెయిన్‌లో అయితే వైద్య విద్య‌కు 25లక్షలు మాత్ర‌మే ఖ‌ర్చు అవుతుండ‌డంతో ఉక్రెయిన్‌కు వలసలు పెరిగాయని, అందుకు కేంద్రం విధానాలే కారణమని సీఎం కేసీఆర్ అన్నారు.