Power Issue : మోడీ, జ‌గ‌న్ ద్వ‌యానికి కేసీఆర్ రివ‌ర్స్ `ప‌వ‌ర్` పంచ్

విద్యుత్ బ‌కాయిల రూపంలో ఏపీ, తెలంగాణ మ‌ధ్య వివాదం షురూ అయింది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్రానికి చేసిన ఫిర్యాదును కేసీఆర్ అసెంబ్లీలో కొట్టిపారేశారు.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 01:12 PM IST

విద్యుత్ బ‌కాయిల రూపంలో ఏపీ, తెలంగాణ మ‌ధ్య వివాదం షురూ అయింది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్రానికి చేసిన ఫిర్యాదును కేసీఆర్ అసెంబ్లీలో కొట్టిపారేశారు. విద్యుత్ బ‌కాయిలు రూ. 6వేల కోట్లు ఏపీకి ఇవ్వాల‌ని కేంద్రం రాసిన లేఖ‌ను తెలంగాణ సీఎం త్రోసిబుచ్చారు. అంతేకాదు, ఏపీ ప్ర‌భుత్వం రూ. 17,838 కోట్లు ఇవ్వాల‌ని రివ‌ర్స్ అటాక్ చేశారు. ఆ విష‌యాన్ని కేంద్రానికి చెప్పిన‌ప్ప‌టికీ ప‌ట్టించుకోలేద‌ని తెలంగాణ అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్ ఆరోప‌ణ‌ల‌కు దిగారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిల‌ను ఒకేసారి టార్గెట్ చేస్తూ ఆయ‌న చేసిన ప్ర‌సంగం ఆద్యంత‌మూ ఆక‌ట్టుకుంది. విద్యుత్ బకాయిల విష‌యంలో తాను చెప్పేది అబ‌ద్ధమైతే, సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసిరారు.

రైతుల వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్లు బిగించేందుకు బిల్లు తీసుకొచ్చిన కేంద్ర ప్ర‌భుత్వంపై కేసీఆర్ విరుచుకుప‌డ్డారు. దేశ వ్యాప్త ఉద్య‌మం చేసి మీట‌ర్ల‌ను అడ్డుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు. మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రించ‌ద‌ని తేల్చి చెబుతూనే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ను త‌ప్పుబ‌ట్టారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో మోటార్ల‌కు మీట‌ర్లు బిగించిన విష‌యాన్ని అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్ వెల్ల‌డించారు.

ఇదిలా ఉంటే, ఏపీ డిస్కంల నుంచి తెలంగాణకు రూ.12,940 కోట్లు రావాలని తెలంగాణ అధికారులు అంటున్నారు. వ‌డ్డీతో స‌హా 17,838 కోట్లు సుమారుగా బ‌కాయి ఉన్న విష‌యాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణాకు ఏపీ చెల్లించాల్సిన బకాయిల గురించి తేల్చకుండా తిరిగి తెలంగాణాయే ఏపీకి బకాయిలు చెల్లించాలని కేంద్రం ఆదేశించటం ఏమిట‌ని కేసీఆర్ నిలదీశారు. రాష్ట్ర విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణ పరిధిలోని కేంద్రీయ విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) పరిధిలో ఉన్నాయని, ఆ రెండు జిల్లాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు విద్యుత్ సంస్థలు రుణాలు తీసుకున్నాయని పేర్కొన్నాయి. ఆ రుణాల చెల్లింపునకు తీసుకున్న మొత్తం రూ.12,941 కోట్లు ఉంటుందని, ఈ లెక్కన ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సిన బకాయిల కంటే ఇవే ఎక్కువని, కాబట్టి ఏపీకి బకాయిలు చెల్లించే ప్రశ్నే లేదని కేసీఆర్ తేల్చేశారు.