Site icon HashtagU Telugu

CM KCR : కేసీఆర్ మాస్ట‌ర్ స్కెచ్ ఇలా.!

ప్ర‌త్య‌ర్థి పార్టీ బ‌లాబ‌లాలను అంచ‌నా వేయ‌డంలో కేసీఆర్ దిట్ట‌. ఎప్ప‌టిప్పుడు సైలెంట్ గా నిఘా వ‌ర్గాల ద్వారా స‌మాచారాన్ని సేక‌రించుకుంటాడు. ఎప్పుడు, ఎక్క‌డ దెబ్బ కొట్టాలో…ముహూర్తం చూసుకుని కేసీఆర్ ప్ర‌త్య‌ర్థుల‌పై రాజ‌కీయ దాడి చేస్తాడు. ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు స‌రైన స‌మ‌యంలో స‌రైన విధంగా స‌మాధానం చెప్ప‌డానికి కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడు. జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీకారం చుట్ట‌బోతున్న ఆయ‌న తొలుత డిసెంబర్ 19న వనపర్తిలో జిల్లాలో ప‌ర్య‌టిస్తాడు. మరుసటి రోజు జనగాం జిల్లాలో పర్యటన ఉంటుంది. డిసెంబర్‌ 17న తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు తదితరులు పాల్గొంటారు.

హుజూరాబాద్‌తో పాటు మరో నాలుగు మండలాల్లో దళితుల బంద్‌ అమలుపై చర్చించేందుకు డిసెంబర్‌ 18న ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. వరి కొనుగోళ్ల పురోగతిపై సమీక్షిస్తారు. ఆ తరువాత జిల్లా టూర్ల‌కు వెళ్లే ఆయ‌న పూర్తి స్థాయిలో అభివృద్ధి ప‌నుల‌పై దృష్టి పెట్ట‌నున్నారు. వ‌న‌ప‌ర్తి జిల్లా కలెక్టరేట్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. అక్క‌డే మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబరు 20న సీఎం జనగాంలో పర్యటించి జిల్లా కలెక్టరేట్‌ సముదాయాన్ని ప్రారంభిస్తాడు. త్వరలో అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అచ్చంపేటలో ఉమామహేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి-భోంగిరి, వికారాబాద్‌లో జిల్లా కలెక్టరేట్లను సీఎం ప్రారంభించనున్నారు. ఇలా ఆయ‌న జిల్లా ప‌ర్య‌ట‌న‌ల్లో ప్ర‌జ‌ల్ని త‌మ వైపు తిప్పుకోవ‌డంతో పాటు ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేయ‌డానికి సిద్ధం అయ్యాడు. సేమ్ టూ సేమ్ 2018 ఎన్నిక‌ల‌కు ముందుగా ఇలాగే కేసీఆర్ చేశాడు. సో…ముంద‌స్తుకు ప్ర‌జ‌ల్ని సిద్ధం చేస్తున్నాడ‌న్న‌మాట‌.ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌కు క‌ళ్లెం వేయ‌డానికి స‌చివాల‌య నిర్మాణం వేగం చేయాల‌ని కేసీఆర్ ఆదేశించాడు. ఆధునాత‌న హంగుల‌తో స‌చివాల‌యం నిర్మాణం వేగంగా జ‌రుగుతోంద‌. సుమారు 600 కోట్ల‌తో నిర్మిత‌మ‌వుతోన్న స‌చివాల‌యం పూర్తి వాస్తు ప్ర‌కారం జ‌రుగుతోంది. ఆధ్యాత్మిక‌త‌, వాస్తుల‌పై కేసీఆర్ కు అపార న‌మ్మ‌కం. అందుకే, యాదాద్రి ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తున్నాడు. దాన్ని సెంటిమెంట్ రూపంలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇంకో వైపు స‌చివాల‌యం ఆయ‌న‌కు క‌లిసొచ్చేలా నిర్మాణం జ‌రుగుతోంద‌ని ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌.
హుజూరాబాద్ ఉప ఫ‌లితాల త‌రువాత మీడియా ముందుకొచ్చాడు. వ‌రుస‌గా మూడు రోజుల పాటు ప్రెస్ మీట్ పెట్టాడు. ఇక రోజూ మీడియా ముందుకొచ్చి..ప్ర‌తిదాన్ని తాను వివ‌రిస్తాను అంటూ వ‌రి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంపై విమ‌ర్శనాస్త్రాల‌ను సంధించాడు. అంతేకాదు, ఇందిరా పార్కు వ‌ద్ద ఒక రోజు ధ‌ర్నాకు దిగాడు. ఢిల్లీలో తేల్చుకుంటానంటూ అక్క‌డికి వెళ్లాడు. సీన్ క‌ట్ చేస్తే…సైలెంట్ అయ్యాడు.

జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు డిసెంబ‌ర్ 19 నుంచి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నాడు. ఆలోపే నామినేటెడ్ పోస్టులను వేగంగా భ‌ర్తీ చేస్తున్నాడు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా ఉన్న లీడ‌ర్ల‌కు ఏదో ఒక ప‌ద‌విని అప్ప‌గిస్తున్నాడు. ఇంకో వైపు ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన లీడ‌ర్ల‌ను కాపాడుకోవ‌డానికి స‌ల‌హాదారులుగానో, ఎమ్మెల్సీల‌గానో…అవ‌కాశం క‌ల్పిస్తున్నాడు. పార్టీలోని అసంతృప్తిని గ‌మ‌నించిన ఆయ‌న దాన్ని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని అర్థం అవుతోంది. ఇంటి గెలిచి ర‌చ్చ గెలవాల‌నే నానుడికి అనుగుణంగా న‌డుస్తున్నాడు. ఫౌంహౌస్ నుంచి ప‌రిపాల‌న కేసీఆర్ సాగిస్తున్నాడు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ టూ ఫాంహౌస్ కు వెళ్ల‌డానికి ఏడాదికి వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని ప్ర‌త్య‌ర్థులు లెక్కిస్తున్నారు. దేశంలోని ఏ ముఖ్య‌మంత్రి ఇలా గ‌డీల నుంచి పరిపాల‌న సాగించ‌డంలేదు. కానీ, కేసీఆర్ మాత్రం ఏడేళ్లుగా ఫాంహౌస్, ప్ర‌గ‌తిభ‌వ‌న్ వేదిక‌గా తెలంగాణ ప‌రిపాల‌న సాగిస్తున్నాడు. దీన్ని ప్ర‌ధాన అంశంగా తీసుకుని ప్ర‌త్య‌ర్థి పార్టీలు చాలా కాలంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీట‌న్నింటికీ ఏ విధ‌మైన ఫుల్ స్టాప్ కేసీఆర్ పెడ‌తాడో..చూద్దాం.!