CM KCR : ఢిల్లీ టూ వార‌ణాసి హ‌డావుడి

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎత్తుగ‌డ‌లు ఉత్త‌ర‌భార‌తంలో పార‌డంలేద‌ని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్ర‌కారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ సాధ్య‌ప‌డ‌లేదు.

  • Written By:
  • Publish Date - March 3, 2022 / 02:19 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎత్తుగ‌డ‌లు ఉత్త‌ర‌భార‌తంలో పార‌డంలేద‌ని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్ర‌కారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ సాధ్య‌ప‌డ‌లేదు. కానీ, యూపీలోని ఎస్పీ పార్టీ కి మ‌ద్ధ‌తు ఇచ్చేందుకు వెళుతున్నాడు. శుక్ర‌వారం నాడు యూపీలోని వార‌ణాసి పార్ల‌మెంట్ పరిధిలో ఎస్పీ బ‌హిరంగ స‌భ ఉంది. ఆ స‌భ‌కు వెళ్ల‌డానికి కేసీఆర్ రెడీ అయ్యాడు. వార‌ణాసి మోడీ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో అక్క‌డ నుంచి బీజేపీ వ్య‌తిరేక గ‌ళం వినిపించ‌డానికి సిద్ధం అయ్యాడు. ఆ క్ర‌మంలో కేసీఆర్ తో కూడిన ఫ్లెక్సీల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ సింగ్, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ థాకరే, మాజీ ప్రధాని దేవేగౌడ, మంత్రి కేటీఆర్, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తదితరుల ఫొటోలు ఉన్నాయి. ‘ఉత్తరప్రదేశ్ మీకు హార్థిక స్వాగతం పలుకుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ `దేశ్ కా నేత కేసీఆర్’ అని ఫ్లెక్సీపై రాశారు. ఆ ఫ్లెక్సీ డిజైన్ గ‌మ‌నిస్తే ప‌క్కా టీఆర్ఎస్ అభిమానులు త‌యారు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ ఫ్లెక్సీలో కేటీఆర్‌, ప్ర‌కాశ్ రాజ్ ఫోటోలు క‌నిపించ‌డంతో గులాబీ శ్రేణుల హ‌డావుడిగా భావిస్తున్నారు.మూడు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేసీఆర్ బీజేపీ, కాంగ్రెసేత‌ర ఫ్రంట్ కోసం ఏదో చేస్తార‌ని గులాబీ శ్రేణులు ఊహించాయి. కానీ, చ‌డీచ‌ప్పుడు లేకుండా రెండు రోజులు ఢిల్లీలోనే కేసీఆర్ గ‌డిపాడు. కేజ్రీవాల్ తో భేటీ లేద‌ని తెలియ‌డంతో ఎయిమ్స్ ప‌రీక్ష‌ల కోసం మాత్ర‌మే ఢిల్లీ వ‌చ్చిన‌ట్టు టీఆర్ఎస్ లీకులు ఇస్తోంది. అదే స‌మ‌యంలో మోడీ అడ్డా వార‌ణాసికి కేసీఆర్ శుక్ర‌వారం వెళ్ల‌నున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. యూపీ ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి ద‌శ‌కు రావ‌డంతో `ఎస్పీ` ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఎలాంటి వాళ్ల స‌హాయాన్నైనా పొంద‌డానికి సిద్ధం అయింది. ఐదు విడ‌త‌ల పోలింగ్ స‌ర‌ళి పూర్తిగా అనుకూలంగా లేద‌ని తేల‌డంతో `ఎస్పీ` ప‌లు ప్రాంతీయ పార్టీల మ‌ద్ధ‌తు కోరుకుంటోంది. గ‌తంలోనూ చంద్ర‌బాబునాయుడు మ‌ద్ధ‌తు తీసుకుంది. ప‌లు ఎన్నిక‌ల్లో యూపీకి వెళ్లిన బాబు ఎస్పీ అధినేత‌గా ఉన్న మూలాంసింగ్ యాద‌వ్ కు అండ‌గా ఆనాడు నిలిచాడు. ఆ పాత్ర‌ను ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఏదో ఒక ర‌కంగా జాతీయ నాయ‌కునిగా ఫోక‌స్ కావాల‌ని కేసీఆర్ త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. కానీ, ఆయ‌న‌కు పోటీగా మ‌మ‌త‌, స్టాలిన్ చాలా వేగంగా ముందుకు దూసుకెళుతున్నారు. సిద్ధాంత రీత్యా మోడీకి వ్య‌తిరేకంగా చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. పైగా బెంగాల్ ఎన్నిక‌ల్లో మోడీ, షా ద్వ‌యాన్ని ఎదిరించిన ధీర వనితి మ‌మ‌త‌. వామ‌ప‌క్షాల‌ను చీల్చి చెండాడిన యోధురాలు ఆమె. ఇక ద్రావిడ సిద్ధాంతంతో జాతీయ స్థాయికి ఎద‌గాల‌ని స్టాలిన్ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఆ దిశ‌గా చేత‌ల ద్వారా త‌న ప‌రిపాల‌న‌లో త‌మిళ‌నాట సామాజిక న్యాయాన్ని చూపిస్తున్నాడు. ఫెడ‌ర‌లిజం అనేది ద్రావిడ సిద్దాంతంగా ఉంద‌నే విష‌యాన్ని దేశ స్థాయికి తీసుకెళ్ల‌డానికి ఇప్ప‌టికే మీటింగ్ లు పెట్టాడు. మేధావుల‌తో దానిపై అధ్య‌య‌నం చేయిస్తున్నాడు. ఆయ‌న జీవిత చ‌రిత్ర పుస్త‌కం ఆవిష్క‌ర‌ణ‌కు వ‌చ్చిన వివిధ రంగాల‌కు చెందిన నిపుణులు కూడా ఫెడ‌ర‌లిజం, సామాజిక న్యాయం కేవ‌లం స్టాలిన్ వ‌ల్ల‌నే అవుతుంద‌ని విశ్వ‌సించారు. పైగా ఎంపీల ప‌రంగా 38 మంది డీఎంకే పార్టీకి ఉన్నారు. కేవ‌లం 9 మంది ఎంపీల‌తో ఢిల్లీ చ‌క్రం తిప్ప‌డానికి కేసీఆర్ వెళ్లాడు.ఏడున్న‌రేళ్ల కేసీఆర్ పాల‌నలో మోడీకి మ‌ద్ధ‌తుగా నిలిచాడు. పార్ల‌మెంట్ బ‌య‌ట‌, లోప‌ల ప‌ర‌స్ప‌రం స‌హ‌కారం అందించుకున్నారు. ప‌లు వివాద‌స్ప బిల్లుల‌కు కూడా పార్ల‌మెంట్ వేదిక‌గా ఎన్డీయేతో క‌లిసి టీఆర్ఎస్ ప‌నిచేసింది. ఇటీవ‌ల జ‌రిగిన రైతు చ‌ట్టాల వ్య‌తిరేక పోరాట రైతు నాయ‌కుడు తికాత్ కూడా కేసీఆర్ ను వ్య‌తిరేకించాడు. కాంగ్రెస్ పార్టీ ఆయ‌న్ను విశ్వాసంలోకి తీసుకునే అవ‌కాశంలేదు. యూపీలోని భాగ‌స్వామ్య ప‌క్షాలు కూడా కేసీఆర్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డంలేదు. చుట్ట‌పు చూపుగా వ‌స్తే, ఎలా గౌర‌వం ఇస్తారో..ఆ విధంగా మ‌హారాష్ట్ర వెళ్లిన‌ప్పుడు థాక‌రే, శ‌ర‌ద్ ప‌వార్ వ్య‌వ‌హ‌రించారు. ఇక బీజేపీ, కాంగ్రెస్‌కు దూరంగా ఉండే పార్టీలు కూడా ఆచితూచి అడుగు వేస్తున్నాయి. ఆ క్ర‌మంలో కేసీఆర్ పీపుల్స్ ఫ్రంట్ ప్ర‌కాష్ రాజ్‌, ప్ర‌శాంత్ కిషోర్ వ‌ద్ద ఆగిపోయే అవ‌కాశాలు లేకపోలేదు.