ACB Raids : కేంద్రంపై మెరుపుదాడికి బ్ర‌హ్మాస్త్రాలు! కేసీఆర్ స్కెచ్ పాత‌దే.!

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై బ్ర‌హ్మాస్త్రాల‌ను సిద్ధం చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 02:25 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై బ్ర‌హ్మాస్త్రాల‌ను సిద్ధం చేస్తున్నారు. అమ్ముల పొదిలోని సీఐడీ, ఏసీబీల‌ను బ‌య‌ట‌కు తీయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వాటిని విప‌క్షాలపై ప్ర‌యోగించి విజ‌యం సాధించిన గులాబీ బాస్ ఇప్పుడు కేంద్రంపై కూడా అవే అస్త్రాల‌కు ప‌దును పెడుతున్నారని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాల్లోని గుస‌గుస‌లు. పార్టీలోని భ‌యాందోళ‌న‌ల‌ను తొల‌గించేందుకు టిట్ ఫ‌ర్ టాట్ మాదిరిగా కేంద్రంపై మెరుపుదాడి చేయ‌నున్నార‌ని గులాబీ శ్రేణుల్లోని టాక్‌.

ఎనిమిదేళ్లుగా ఏసీబీ, సీఐడీల‌తో కేసీఆర్ రాజ‌కీయాన్ని న‌డిపారని ప్ర‌త్య‌ర్థుల అభిప్రాయం. విప‌క్షాల‌ను చిత్తు చేయ‌డానికి వాటిని వాడుకున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపించిన ఆరోప‌ణ‌లు. అధికారంలోకి వ‌చ్చిన 2014 త‌రువాత తొలుత ఏసీబీకి ఆయ‌న ప‌దును పెట్టారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా డైరెక్ష‌న్స్ ఇచ్చే కొంద‌రు న్యాయమూర్తుల‌పై తొలి రోజుల్లో ఏసీబీ ప‌నిచేసింద‌ని అప్ప‌ట్లో హైకోర్టు పరిస‌రాల్లోని వినికిడి. రాష్ట్ర వ్యాప్తంగా న‌లుగురు న్యాయ‌మూర్తుల‌ను కొన్ని నెల‌ల వ్య‌వ‌ధిలో ఏసీబీ ట్రాప్ చేయ‌డం ద్వారా న్యాయ వ్య‌వ‌స్థ‌ను కేసీఆర్ అప్ర‌మ‌త్తం చేశార‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఇప్ప‌టికీ చెబుతుంటాయి.

ఇక తెలంగాణ‌లో బ‌లంగా ఉన్న టీడీపీలోని రేవంత్ ను అప్ప‌ట్లో ఏసీబీ ట్రాప్ చేయ‌డం ద్వారా ఆ పార్టీని క‌నుమ‌రుగు చేశారు. ఆ త‌రువాత ఎమ్మెల్యేల‌ను అధికార బ‌లంతో ప‌లు ర‌కాలుగా ఆందోళ‌న‌కు గురిచేసి టీఆర్ఎస్ పంచ‌న చేరేలా చేశార‌ని టీడీపీ చెప్పే మాట‌. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి దాదాపుగా టీడీపీని ఖాళీ చేసి దానిలోని లీడ‌ర్లు కారు ఎక్కించారు కేసీఆర్. ఇక‌ రెండోసారి సీఎం అయిన త‌రువాత సీఐడీకి ప‌దును పెట్టారు. ప్ర‌భుత్వం మీద ఎవ‌రైనా ఆరోప‌ణ‌లు చేస్తే వాళ్ల‌ను అరెస్ట్ చేయించ‌డం ప్రారంభించారు. ఆ క్ర‌మంలో ప‌లువురు జ‌ర్న‌లిస్ట్ ల‌ను జైళ్ల‌లో పెట్టించారు. కాంగ్రెస్ పార్టీని నామ‌రూపాల్లేకుండా అసెంబ్లీలో చేయ‌గ‌లిగారు. తిరుగులేని ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తూ విప‌క్షాల ఉనికి మీద దెబ్బ వేయ‌డానికి సీఐడీ, ఏసీబీల‌ను కేసీఆర్ బాగా వాడార‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీ లీడ‌ర్లు త‌ర‌చూ చెప్పే మాట‌. పోలీసు వ్య‌వ‌స్థ‌ను వ్య‌క్తిగ‌త ప‌తిష్ట, రాజ‌కీయ‌ల కోసం వాడుకున్న సంద‌ర్భాల‌ను తెలంగాణ‌లోని ఏ రాజ‌కీయ పార్టీ లీడ‌ర్ ను అడిగినా బ‌ల్ల‌గుద్ది చెబుతారు.

న్యాయ‌, ప్రెస్, రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ల మీద అధికార ద‌ర్పం చూపుతూ ఏసీబీ, సీఐడీల‌ను ఇప్ప‌టి దాకా కేసీఆర్ వాడ‌ర‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. ఇప్పుడు వాటినే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగుల మీద ప్ర‌యోగించాల‌ని భారీ స్కెచ్ వేశార‌ని తెలుస్తోంది. రేపోమాపో ఏసీబీ, సీఐడీ రంగంలోకి దిగ‌డం ద్వారా ఐటీ, ఈడీ ఉద్యోగుల‌తో పాటు కీల‌కంగా ఉండే కేంద్ర ఉద్యోగుల భ‌ర‌తం ప‌ట్టాల‌ని యోచిస్తున్నార‌ట‌. ఆ ప్ర‌క్రియ‌పై కొందరు న్యాయ నిపుణుల‌తో చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టిన కేసీఆర్ ఇప్పుడు సీఐడీ, ఏసీబీ అస్త్రాల‌ను బ‌య‌ట‌కు తీస్తే కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య వార్ ఎటు ట‌ర్న్ తీసుకుంటుందో చూడాలి.