Bihar Politics : బీహార్ ప్ర‌భుత్వ మార్పుపై `కేసీఆర్` నీడ‌!

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయ ప్ర‌భావం బీహార్ వేదిక‌గా క‌నిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 05:00 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయ ప్ర‌భావం బీహార్ వేదిక‌గా క‌నిపిస్తోంది. అక్క‌డ నుంచి తొలి ఆప‌రేష‌న్ ప్రారంభించిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ రాష్ట్రానికి చెందిన ప్ర‌శాంత్ కిషోర్ ద్వారా అతి పెద్ద రాజ‌కీయ వ్యూహాన్ని ర‌చించార‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాల్లోని టాక్. జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి సారించిన త‌రువాత ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ రెండుసార్లు కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ స‌మ‌యంలోనే బీహార్ రాష్ట్ర రాజ‌కీయాల‌పై ప్ర‌శాంత్ కిషోర్ ద్వారా పావులు క‌దిపార‌ట‌. దాని ప‌ర్య‌వ‌సాన‌మే ఇప్పుడు బీహార్ లో ప్ర‌భుత్వం మార్పుకు నాంది ప‌లికింద‌ని టీఆర్ఎస్ శ్రేణుల్లోని టాక్‌.

ప్ర‌త్యామ్నాయ ఎజెండా ద్వారా జాతీయ రాజ‌కీయాల్లో మార్పు తీసుకురావాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం మేధావులు, వివిధ రంగాల‌కు చెందిన నిపుణులు, రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో త‌ర‌చూ స‌మావేశం అవుతున్నారు. ఫౌంహౌస్ వేదిక‌గా ప‌దునైన వ్యూహాల‌ను కేసీఆర్ ర‌చిస్తున్నారు. స‌హ‌జ మిత్రునిగా ఉన్న ఎంఐఎం, రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ద్వారా బీహార్ ఆప‌రేష‌న్ అంతా ఫౌంహౌస్ లోనే జ‌రిగింద‌ని తెలుస్తోంది. తొలుత బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌శాంత్ కిషోర్ పాద‌యాత్ర‌కు ప్లాన్ చేశారు. ఆయ‌న తో కొత్త పార్టీ పెట్టించాల‌నే ఆలోచ‌న చేశార‌ట‌. కానీ, తాత్కాలికంగా వెనుక‌డుగు వేసిన పీకే ద్వారా బీహార్ రాజ‌కీయాల‌ను కేసీఆర్ ఆప‌రేట్ చేశార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లోని ఒక వ‌ర్గం చెప్పుకుంటోన్న మాట‌లు.

జేడీయూ నేత నితీష్ తో కొన్ని ద‌శాబ్దాలుగా కేసీఆర్ కు ప‌రిచ‌యాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం ప‌నిచేసిన కేసీఆర్ ఆనాడు ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన నేష‌న‌ల్ ఫ్రంట్ నేత‌ల‌ను ద‌గ్గ‌ర నుంచి చూశారు. వాళ్ల‌తో ఆనాటి నుంచి ప‌రిచ‌యాల‌ను పెంచుకున్నార‌ట‌. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం సాధించ‌డానికి ఆ ప‌రిచ‌యాలు బాగా ప‌నిచేశాయ‌ని గులాబీ శ్రేణుల్లోని టాక్‌. ఇప్పుడు అవే ప‌రిచ‌యాల‌కు మ‌రింత ప‌దును పెట్ట‌డం ద్వారా మోడీ స‌ర్కార్ ను దించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎన్డీయే కూట‌మిని చీల్చ‌డానికి మాస్ట‌ర్ ప్లాన్ వేశార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలో మొద‌టి ఆప‌రేష‌న్ బీహార్ నుంచి ప్రారంభించార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లోని అభిప్రాయం.బీహార్, జార్ఖండ్‌, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, ఏపీ రాజ‌కీయాల‌పై త‌న‌దైన శైలిలో వ్యూహాల‌ను ర‌చించ‌డానికి తెలంగాణ సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఇప్ప‌టికే వీలున్న‌ప్పుడ‌ల్లా క‌ర్నాట‌క‌లోని జేడీఎస్ నేత దేవ‌గౌడ‌ను క‌లుస్తున్నారు. మ‌హారాష్ట్ర‌లోని ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్, త‌మిళ‌నాడులోని డీఎంకే చీఫ్ స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ క‌లిశారు. వాళ్ల‌తో ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని దించేలా మంత‌నాలు సాగించారు. మిగిలిన రాష్ట్రాల్లో స‌హ‌జ మిత్రునిగా ఉన్న ఎంఐఎం ద్వారా పావులు క‌దుపుతున్నారు. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న ప్ర‌శాంత్ కిషోర్ ఇచ్చే `క్లూ`ల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల‌ను ఏకం చేసే ప‌నిలో కేసీఆర్ ఉన్నారు. సమాంత‌రంగా కాంగ్రెస్ పార్టీతోనూ రాజ‌కీయ వ్యూహాల‌ను ర‌చిస్తూ రాహుల్ గాంధీకి పలు సంద‌ర్భాల్లో మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు.

మొత్తం మీద బీహార్ ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయింద‌ని, త‌రువాత కేసీఆర్ టార్గెట్ మ‌హారాష్ట్ర‌గా టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. ప్ర‌స్తుతం బీహార్ త‌ర‌హాలోనే మ‌హారాష్ట్ర‌లోనూ ప్ర‌భుత్వ మార్పు ఉండేలా పావులు క‌దుపుతున్నార‌ని తెలుస్తోంది. మొత్తం మీద కేసీఆర్ ఆప‌రేష‌న్ బీహార్లో ఫ‌లించింద‌ని,ఇదే పంథాలో ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని దించే వ‌ర‌కు కేసీఆర్ ఎత్తుగ‌డ‌లు ఉంటాయ‌ని ఆయ‌న వ‌ర్గీయులు చెబుతున్నారు. జాతీయ రాజకీయాల‌పై ఇప్పుడు ప‌రోక్షంగా ప్ర‌భావం చూపుతోన్న కేసీఆర్ రాబోవు రోజుల్లో ప్ర‌త్య‌క్షంగా రంగంలోకి దిగుతార‌ని టీఆర్ఎస్ శ్రేణుల్లోని చ‌ర్చ‌.