Telangana Rains: ఎట్టి పరిస్థితుల్లో ప్రాణనష్టం జరగొద్దు, మంత్రులకు సీఎం ఆదేశాలు

తెలంగాణాలో గత వారం రోజులుగా అతిభారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Telangana Rains: తెలంగాణాలో గత వారం రోజులుగా అతిభారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ముంపు బాధితులపై ఆరా తీసింది. మంత్రుల్ని రంగంలోకి దింపారు సీఎం కేసీఆర్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దంటూ కేసీఆర్ మంత్రుల్ని ఆదేశించారు. వర్షాల నుంచి ప్రజలను రక్షిస్తూ, ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టే దిశగా మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అందులో భాగంగా ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు పరిస్థితిని పర్యవేక్షించారు.

మంత్రులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ప్రాణనష్టం జరగకుండా చూడాలని, అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి మెరుగైన చికిత్స అందించేలా చూసుకోవాలని సీఎం కోరారు. ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం మంత్రులకు ఫోన్లలో మాట్లాడారు.

ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎస్ బృందాలు, రక్షణచర్యల కోసం హెలికాప్టర్ల సహా, వైద్య సేవలు, ఆహార సామాగ్రి సరఫరాకు సంబంధిత శాఖల యంత్రాంగాన్ని పంపించేలా చర్యలు చేపట్టామని తెలంగాణ సీఎస్ శాంతికుమారి తెలిపారు. విపత్తుల నిర్వహణ శాఖకు, ఫైర్ సర్వీసుల శాఖకు, పోలీసు శాఖతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలు చేపట్టామని ఆమె అన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని సహాయక చర్యల్లో పాల్గొనేలా అప్రమత్తం చేయాల్సిందిగా రాష్ట్ర డిజిపి ని సీఎం ఆదేశించినట్టు సీఎస్ చెప్పారు. ఈ మేరకు స్టేట్ లెవల్ ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి డిజిపి పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు పోలీసులు చేస్తున్న కృషి ఫలిస్తున్నదని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు.

Also Read: Rain Alert Today : తెలంగాణలోని 10 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు