Site icon HashtagU Telugu

CM KCR In TN: తమిళనాడులో కేసీఆర్ ప్రత్యేక పూజలు, నేడు స్టాలిన్ తో భేటీ

Whatsapp Image 2021 12 13 At 22.49.01 Imresizer

kcr in tamil nadu

తెలంగాణ సీఎం కేసీఆర్ తన కుటుంబసభ్యులతో త‌మిళ‌నాడు పర్యటనకు వచ్చారు. తిరుచిరాప‌ల్లి జిల్లా శ్రీరంగంలోని రంగ‌నాథ‌స్వామి ఆల‌యంలో నిన్న ప్రత్యేక పూజ‌లు నిర్వహించారు. తిరుచ్చి కలెక్టర్ శివరాసు, తమిళనాడు మంత్రి అరుణ్ నెహ్రు కేసీఆర్ కి స్వాగతం పలికారు. ఆలయంలో మొక్కులు చెల్లించుకొని ఆశీర్వాదం తీసుకున్న కేసీఆర్ ఈరోజు సాయంత్రం తమినాడు సీఎం స్టాలిన్ తో భేటీ కానున్నారు.

కేసీఆర్ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశం బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాలని, కేంద్రం నిర్ణయాలపై వెంటాడుతాం, వేటాడుతామని కేసీఆర్ ప్రకటించారు. ఇక కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో కలిసొచ్చే పార్టీలను కలుపుకుపోతానని, బీజేపీని ఓడించడానికి దేశం మొత్తాన్ని ఏకం చేస్తానని ప్రకటించిన నేపధ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకొంది.

స్టాలిన్ రాజకీయంగానే కాకుండా సైద్ధాంతికంగా కూడా బీజేపీకి వ్యతిరేకి కాబట్టి సహజంగానే మోదీపై పోరుకు తాను తప్పకుండా కలిసివస్తారు. జీఎస్టీ చెల్లింపుల్లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్షత, నీట్ పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించడం, నదీ జలాల పంపకాలు, విద్యుత్ చట్ట సవరణ బిల్లు లాంటి రాష్ట్ర సమస్యలు వీరి భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.

బెంగాల్ సీఎం మమత తనపార్టీని దక్షిణాది రాష్ట్రాల్లో బలోపేతం చేయాలని ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో ఈ టాపిక్ చర్చించే అవకాశముంది. ఇక గతంలో చర్చించిన థర్డ్ ఫ్రంట్ విషయం కూడా చర్చించే అవకాశముంది.
ఉమ్మడిగా బీజేపీని ఎదుర్కొనే అంశానికి సంబంధించి ఎలా ముందుకువెళ్లాలో అనే అంశంపై రెండు పార్టీల అధినేతలు ఒక అవగాహనకు వచ్చే అవకాశముంది.